Kumbh Mela Begins : కుంభమేళా ప్రారంభం.. 45 రోజుల పాటు భక్తజన జాతర

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా మహా కుంభమేళా ప్రారంభమయ్యింది. భక్తిశ్రద్ధలతో మహా కుంభ్ ను నిర్వహిస్తున్నారు. ఈ మహాకుంభ మేళా మొత్తం 45 రోజుల పాటు సాగనుంది. పుష్య పౌర్ణమిని పురస్కరించుకుని తొలి పుణ్యస్నానంతో ఈ మహా క్రతువుకు యూపీ సర్కారు శ్రీకారం చుట్టింది. గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రాంతంలో నిర్వహిస్తున్న మహా కుంభమేళాకు దేశ, విదేశాల నుంచి దాదాపు 35 కోట్ల మంది ప్రజలు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేసింది. అందుకు తగ్గట్టుగా యోగి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. గంగ, యమునలతోపాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది కలిసే త్రివేణీ సంగమంలో మహా కుంభమేళా జాతార కొనసాగుతోంది. మహా కుంభమేళాకు రెండు రోజుల ముందే స్నానాల సందడి ప్రారంభమయ్యింది. శనివారం 25 లక్షల మంది, ఆదివారం లక్ష మంది వరకూ పుణ్య స్నానాలు ఆచరించారని అధికారులు చెబుతున్నారు. దీంతో ఘాట్లన్నీ కిటకిటలాడుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com