Bihar : పార్టీ, ఫ్యామిలీ నుంచి తేజ్ ప్రతాప్‌ను బహిష్కరించిన లాలూ

Bihar : పార్టీ, ఫ్యామిలీ నుంచి తేజ్ ప్రతాప్‌ను బహిష్కరించిన లాలూ
X

బీహార్ మాజీ మంత్రి, లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ పై రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) బహిష్కరణ వేటు వేసింది. పార్టీతో పాటు కుటుంబం నుంచి కూడా ఆరేళ్ల పాటు తేజ్ ప్రతాప్ ను బహిష్కరిస్తున్నట్టు ఆదివారం ప్రకటించింది. తేజ్ ప్రతాప్ తన చిరకాల భాగస్వామిగా ఒక యువతిని పేర్కొంటూ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ కావడంతో లాలూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. లాలూ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో తేజ్ ప్రతాప్ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

వ్యక్తిగత నైతికత, ప్రజల పట్ల ఉన్న బాధ్యతను పదేపదే తేజ్ ప్రతాప్ అతిక్రమిస్తున్నట్టు లాలూ ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఇక నుంచి పార్టీ వ్యవహరాల్లో, కుటుంబ వ్యవహరాల్లో తేజ్ ప్రతాప్కు ఎలాంటి పాత్ర లేదని, తేజ్ ప్రతాప్ తన వ్యక్తిగత వ్యవహారాలను స్వతంత్రంగానే చక్కబెట్టుకోగలడని, ఆయనతో సంబంధాలు పెట్టుకోవాలనుకునే వారు స్వీయ విచక్షణతో వ్యవహరించాలని లాలూ తన ట్వీట్లో సూచించారు. దీనిపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ.. తన ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయిందని, తన ఖాతాలో తప్పుడు సమాచారం పోస్టు చేయడం వల్లనే ఇలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు.

ఈ పరిణామాలను ఎన్నికల స్టంట్ అని నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) కొట్టిపారేసింది. ఎన్నికల సమయంలో ఆయన బీహార్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, ఎన్నికల తర్వాత తేజ్ ప్రతాప న్ను తిరిగి పార్టీలోకి తీసుకోవడం ఖాయమని జేడీయూ జాతీయ ప్రతినిధి రాజీవ్ రంజన్ చెప్పారు.

Tags

Next Story