Himachal Bus Landslide: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం బస్సుపై 15 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ఓ టూరిస్టు బస్సు ధ్వంసమై 18 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు.
హర్యానాలోని రోహ్‌తక్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ఘుమర్విన్‌కు ప్రైవేటు బస్సు బయలుదేరింది. ఝండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూఘాట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ దుర్ఘటన సంభవించింది. బస్సుపై కొండచరియలు విరిగిపడటంతో వాహనం పూర్తిగా శిథిలాల కింద చిక్కుకుపోయింది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
ఈ ప్రమాదం తర్వాత సంఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే చుట్టుపక్కల నుంచి పెద్ద సంఖ్యలో జనం అక్కడికి వచ్చి గుమిగూడారు. ఇప్పటికే సహాయ చర్యల కోసం జెసిబి యంత్రాలు శిథిలాలను తొలగించాయి. అంబులెన్స్‌లు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే ఇప్పటి వరకు ప్రమాదంలో ఎంత మంది వరకు మరణించారనేది సరిగ్గా తెలియలేదు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇప్పటి వరకు 15 మంది మరణించారని తెలుస్తుంది. ప్రమాదంపై ముఖ్యమంత్రి ఠాకూర్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సాధ్యమైన అన్ని సహాయాలను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలని, వారి చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం సిమ్లా నుంచి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com