Pakistan: లష్కరే కీలక నేత సైఫుల్లా హతం

Pakistan: లష్కరే కీలక నేత సైఫుల్లా హతం
X
సింధ్‌లో కాల్చి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు

లష్కరే తయ్యిబా కీలక నేత, నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్‌ కార్యాలయంపై దాడికి సూత్రధారి అయిన రజావుల్లా నిజామనీ ఖలీద్‌ అలియాస్‌ అబు సైఫుల్లా ఖలీద్‌ హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో ఆదివారం ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. మధ్యాహ్నం సమయంలో మత్లీలోని ఇంటి నుంచి బయటకు వచ్చిన సైఫుల్లాపై బద్నీలోని క్రాసింగ్‌ వద్ద వారు కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకొచ్చే సరికే మృతి చెందాడు. వ్యక్తిగత కక్షలతో అతడిని చంపి ఉండవచ్చని సమాచారం.

2000 సంవత్సరం నుంచి నేపాల్‌ కేంద్రంగా లష్కరే తయ్యిబా తరఫున సైఫుల్లా ఉగ్ర కార్యకలాపాలను నిర్వహించాడు. అతడికి వినోద్‌ కుమార్, మహమ్మద్‌ సలీం, రజావుల్లా అనే మారు పేర్లున్నాయి. భారత్‌లో పలు ఉగ్ర దాడులకు సూత్రధారిగా వ్యవహరించాడు. లష్కరే ఉగ్ర నేత అబు అనాస్‌కు సన్నిహితుడైన సైఫుల్లా.. 2006లో నాగ్‌పుర్‌లోని ఆరెస్సెస్‌ ప్రధాన కార్యాలయంపై దాడికి కుట్ర పన్నాడు. ఈ దాడి సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చి చంపారు.

2005లో బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌పై (ఐఐఎస్సీ) జరిగిన ఉగ్ర దాడిలో సైఫుల్లా పాల్గొన్నాడు. ఈ దాడిలో ఒక ప్రొఫెసర్‌ మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఉగ్రవాదులు పారిపోయారు. పోలీసులు కేసును దర్యాప్తు చేసి అబు అనాస్‌పై అభియోగపత్రం దాఖలు చేశారు. అతడు పరారీలో ఉన్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై దాడికి సైఫుల్లానే సూత్రధారి. ఈ దాడిలో ఏడుగురు సిబ్బంది, ఒక పౌరుడు మరణించారు. ఇద్దరు ఉగ్రవాదులు చీకట్లో తప్పించుకున్నారు.

నేపాల్‌ కేంద్రంగా..

నేపాల్‌ కేంద్రంగా లష్కరే తయ్యిబా కార్యకలాపాలను సైఫుల్లా నిర్వహించాడు. నియామకాలు చేపట్టడం, రవాణా సహకారం, ఇండో-నేపాల్‌ సరిహద్దుల్లో కార్యకలాపాలు ఇతడి విధి. లష్కరే కమాండర్లు అజీం చీమా అలియాస్‌ బాబాజీ, యాకూబ్‌లతో కలిసి సైఫుల్లా పని చేశాడు. భారత దళాలు అతడి కార్యకలాపాలను పసిగట్టడంతో నేపాల్‌ను వదిలి పాకిస్థాన్‌కు మకాం మార్చాడు. అక్కడ లష్కరే, జమాత్‌-ఉద్‌-దవాలకు చెందిన ఉగ్ర నేతలు యూసుఫ్‌ ముజమ్మిల్, ముజమ్మిల్‌ ఇక్బాల్‌ హష్మీ, మహమ్మద్‌ యూసుఫ్‌ తైబీలతో కలిసి పని చేశాడు. సింధ్‌లోని హైదరాబాద్, బదిన్‌లలో నియామకాలు, నిధుల సేకరణల బాధ్యతలను అతడికి ఉగ్ర నేతలు అప్పగించారు.

Tags

Next Story