LK Advani : అద్వానీకి అస్వస్థత.. లేటెస్ట్ హెల్త్ అప్ డేట్

బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ మంగళవారం మళ్లీ అస్వస్థతకు గుర య్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
న్యూరాలజీ విభాగం వైద్యులు ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపాయి. "బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ ఉదయం ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రి లోని న్యూరాలజీ విభాగంలో చేరారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం స్థిరంగా ఉంది. ఆయన్ని వైద్యులు నిశితంగా పరిశీలిస్తున్నారు" అని అపోలో హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అద్వానీ వయసు 96 ఏళ్లు.
వయో సంబంధిత అనారోగ్య సమస్యలతోనే ఆయనను దవాఖానలో చేర్చినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. జూన్ చివరలోనూ ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆ సమయంలో ఎయిమ్స్ చేరారు. యూరాలజీ వైద్యులు చికిత్స అందించారు. ఆ తర్వాత జులై మొదటివారంలో మరోసారి అస్వస్థత చెందడంతో, అపోలో ఆసుపత్రిలో రెండురోజులు చికిత్స పొందారు. బీజేపీ కురువృద్ధుడైన అద్వానీకి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నతో గౌరవించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com