Loan Apps: రూ.5వేలు అప్పు ఇచ్చి రూ.లక్షల్లో వసూలు.. ఇవీ లోన్ యాప్స్ లెక్కలు..

Loan Apps: జస్ట్ 5వేలు, 10వేలు అప్పు ఇచ్చి లక్షల్లో ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి లోన్ యాప్స్. ఈ ఏడు నెలల్లోనే ఏకంగా 500 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టాయని ప్రాథమిక అంచనా. నిజానికి ఈ దందా 2వేల కోట్ల నుంచి 2వేల 500 కోట్లకు పైగానే ఉండొచ్చని చెబుతున్నారు. చైనా కేంద్రంగా సాగుతున్న ఈ యాప్ రాకెట్‌పై ఢిల్లీ పోలీసులు కొరడా ఝుళిపించారు. ఇన్‌స్టంట్ లోన్ యాప్‌లో అప్పు తీసుకున్న వారి నుంచి ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. మొత్తం రెండు నెలల పాటు స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన ప్రత్యేక బృందాలు.. ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లోని కాల్‌సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేసి 22 మందిని అరెస్ట్ చేశారు.
చైనా దేశస్తులు ఇండియాలోని పలు రాష్ట్రాల్లో కాల్‌సెంటర్లు పెట్టి మరీ లోన్ యాప్స్ నిర్వహిస్తున్నారు. ఇన్‌స్టంట్ లోన్ పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌లో వందల యాప్‌లను డంప్ చేసిన నిర్వాహకులు.. చిన్న మొత్తంలో రుణాలు ఆఫర్ చేస్తారు. ఇలా రుణాలు తీసుకునేవారు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేప్పుడే కొన్నింటికి పర్మీషన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలా అడిగిన ప్రతీ దానికీ పర్మిషన్ ఇవ్వడంతో లోన్ తీసుకుంటున్న వారి స్మార్ట్‌ఫోన్ .. యాప్ నిర్వాహకుల నియంత్రణలోకి వెళ్లిపోతుంది. దీంతో వారి వ్యక్తిగత డేటాను హ్యాక్ చేసి, తీసుకున్న రుణం కంటే ఎక్కువ మొత్తం చెల్లించాలంటూ వేధిస్తారు.
ఒకవేళ రుణగ్రహీతలు తిరగబడితే.. వారి ఫొటోలను మార్ఫ్ చేస్తారు. వాటిని కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి పంపుతామని బెదిరిస్తారు. కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారికి ఫలానా వ్యక్తి లోన్ ఎగ్గొట్టాడంటూ మెసేజ్ పంపుతారు. ఇలా లోన్ తీసుకున్న వ్యక్తిని టార్చర్ పెట్టి మరీ అధిక వడ్డీలు గుంజుతున్నారని దర్యాప్తులో తేలింది. ఇలా లక్షల్లో దండుకుంటున్న చైనా యాప్‌లు.. క్రిప్టోకరెన్సీ, హవాలా మార్గాల్లో చైనాకు డబ్బులు తరలిస్తున్నారని తేల్చారు. లోన్ యాప్‌లపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నప్పటికీ.. ప్రతిసారి కాల్‌సెంటర్ ఉద్యోగులు మాత్రమే దొరుకుతున్నారు. అసలు నిర్వాహకులు తప్పించుకుంటున్నారు.
కాల్‌సెంటర్ ఉద్యోగం పేరుతో లోన్‌యాప్ సంస్థలు.. టెలీకాలర్లను భారీగా రిక్ర్యూట్ చేస్తున్నారు. స్థానిక భాష బాగా మాట్లాడితే చాలు.. విద్యార్హతకు సంబంధం లేకుండానే జాబ్ ఆఫర్ చేస్తున్నారు. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ రేంజ్‌లో జీతంతోపాటు పనితీరు ఆధారంగా కమీషన్ ఇస్తామంటూ యువతను ట్రాప్ చేస్తున్నారు. ఒక్కసారి జాబ్‌లో చేరాక.. లోన్ రికవరీ చేయని టెలీకాలర్లను బండబూతులు తిడుతుంటారు.
ఆ కోపాన్నంతా లోన్ తీసుకున్న వారిపై రుద్దుతున్నారు. లోన్ యాప్ కాల్‌సెంటర్ల టార్చర్ కారణంగా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లోన్‌యాప్ ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ పోలీసులు చర్యలు చేపట్టారు. ప్లే స్టోర్ నుంచి 150 వరకు లోన్‌యాప్‌లను తొలగించాలని గూగుల్‌కు లేఖ రాశారు. ఆర్థిక అవసరాలకోసం లోన్‌యాప్‌ల జోలికి వెళ్లొద్దని తెలంగాణ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com