PARLIAMENT: పార్లమెంట్‌లో కొనసాగుతున్న 'మణిపుర్ మంటలు'
పార్లమెంట్(Parliament) వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. మణిపుర్ అంశం(Manipur)పై ఉభయ సభల కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ప్రధాని సమక్షంలోనే మణిపుర్ అంశంపై చర్చ జరగాలని విపక్షాలు(Opposition) పట్టుపట్టడంతోపార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇవాళ కూడా ఆరంభంలోనే ఉభయసభలు వాయిదాపడ్డాయి.
పార్లమెంట్ (Parliament) ఉభయ సభలను మణిపుర్ మంటలు కుదిపేస్తున్నాయి. మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధాని సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడంతో పార్లమెంట్ వర్షాకాల సభ కార్యకలాపాలు జరగడం లేదు. వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్(Parliament) కార్యకలపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
సోమవారం కూడా లోక్‌సభలో వాయిదాల పర్వం కొనసాగింది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్‌సభ(Lok Sabha) మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా పడింది. అలాగే రాజ్యసభ(Rajya Sabha) కార్యకలాపాలు కూడా వాయిదా పడ్డాయి.
ఈ సమావేశాలకు ముందు పార్లమెంట్‌కు వచ్చిన ప్రధాని మోదీ.. కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. అలాగే ప్రతిపక్షాల కూటమి ఇండియా సభ్యులు కూడా భేటీ అయ్యారు. రెండురోజుల పాటు మణిపుర్‌లో పర్యటించిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం మొదలైన సమావేశాలను మణిపుర్(Manipur) అంశం కుదిపేసింది. దాంతో ఉభయ సభలను వాయిదా వేశారు.
మధ్యాహ్నం రాజ్యసభలో మణిపుర్ అంశాన్ని చర్చించాలని ప్రభుత్వం కోరుకుంటోందని రాజ్యసభ సభాపక్ష నేత పీయూష్ గోయల్(Piyush Goyal) ప్రకటించారు. సభ్యులకు ఇచ్చిన స్వేచ్ఛను విపక్ష ఎంపీలు దుర్వినియోగం చేసేలా ప్రవర్తిస్తున్నారని ఆయన మండిపడ్డారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. విపక్షాలు 9 రోజులను వృథా చేశాయని మండిపడ్డారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వ ఆరోపణలను కొట్టిపారేశాయి. రూల్ 267 ప్రకారం మణిపూర్ అంశంపై సమగ్ర చర్చ జరగాలని డిమాండ్ చేశాయి. ప్రధాని మోదీ సభకు వచ్చేందుకు వెనకాడుతున్నారని పేర్కొన్నారు. దీనిపై స్వల్పకాలిక చర్చకు తాము సిద్ధమేనని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు విపక్షాలు అంగీకరించలేదు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com