LPG Crisis : కేంద్రం సంచలన నిర్ణయం.. గ్యాస్ కొరత నేపథ్యంలో ఎస్మా చట్టం అమలు.

LPG Crisis : దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే పరిస్థితి రావడంతో ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా దెబ్బతినడం భారత్‌పై ఈ ప్రభావాన్ని చూపిస్తోంది. దీనిపై ప్రభుత్వం రంగంలోకి దిగి కఠిన చర్యలు చేపట్టింది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో గ్యాస్ ఏజెన్సీల ముందు వినియోగదారులు బారులు తీరారు. ముంబైలో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దాదాపు 50 శాతం హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి. బెంగళూరులోని అత్యంత పురాతనమైన విద్యార్థి భవన్ వంటి రెస్టారెంట్లు కూడా గ్యాస్ లేక సేవలను నిలిపివేసే ఆలోచనలో ఉన్నాయి. లక్నో, భోపాల్‌లలో వారం రోజులుగా సిలిండర్లు అందక సామాన్యులు అల్లాడిపోతున్నారు. హోటళ్లలో వంట గ్యాస్ కొరత కారణంగా మెనూలో కొన్ని ఐటమ్స్‌ను తగ్గించడమే కాకుండా, పని వేళలను కూడా కుదించుకుంటున్నారు.
పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర ప్రభుత్వం Essential Commodities Act (1955) కింద అత్యవసర ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ సరఫరాలో ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలో స్పష్టమైన నిబంధనలు విధించింది:
మొదటి ప్రాధాన్యత: గృహ వినియోగదారులకు (PNG), రవాణా రంగానికి (CNG). వీరికి గత 6 నెలల సగటు వినియోగం ఆధారంగా 100% సరఫరా కొనసాగుతుంది.
రెండవ ప్రాధాన్యత: ఫ్యాక్టరీలు, పరిశ్రమలకు. వీరికి గత వినియోగంలో 80% గ్యాస్ మాత్రమే ఇస్తారు.
మూడవ ప్రాధాన్యత: ఎరువుల కర్మాగారాలకు. వీరికి 70% సరఫరా మాత్రమే ఉంటుంది.
గ్యాస్ కొరతను సాకుగా చూపి ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. సిలిండర్ల బుకింగ్ గడువును కూడా 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచారు. ప్రధాని మోదీ ఈ విషయంలో విదేశాంగ మంత్రి జైశంకర్, పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పశ్చిమ ఆసియా యుద్ధ ప్రభావం సామాన్యుడిపై పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అయితే, ప్రభుత్వం అంతా కంట్రోల్‌లో ఉందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం జనం గ్యాస్ కోసం క్యూ కడుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
