DME Fuel : ఏమిటీ 'డిఎమ్ఈ' గ్యాస్? పాత స్టవ్, పాత సిలిండర్ తోనే వంట.. ఖర్చు లేకుండా సరికొత్త విప్లవం.

DME Fuel : పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు అస్తవ్యస్తమైంది. ఈ ప్రభావం నేరుగా మన వంటింటిపై పడేలా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత్ తన వంటగ్యాస్ అవసరాల కోసం అధిక శాతం విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా నిలిచిపోతే లేదా ధరలు ఆకాశాన్నంటితే పరిస్థితి ఏంటి? అన్న ఆందోళన అందరిలోనూ ఉంది. ఈ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత్ ఒక శక్తివంతమైన ప్లాన్ బిని సిద్ధం చేసింది. అదే స్వదేశీ ఇంధనం డిఎమ్ఈ.
ఏమిటీ డిఎమ్ఈ? వంటింట్లో ఎలా పని చేస్తుంది?
టైమ్స్ నౌ నివేదిక ప్రకారం, డిఎమ్ఈ అంటే డై-మిథైల్ ఈథర్. ఇది ఒక ప్రత్యేకమైన వాయువు, దీనిని మిథనాల్ సహాయంతో కృత్రిమంగా తయారు చేస్తారు. దీని గొప్పతనం ఏంటంటే.. దీనికి కావలసిన మిథనాల్‌ను మన దగ్గర ఉన్న బొగ్గు, బయోమాస్, చివరకు గాలిలో ఉండే కార్బన్ డయాక్సైడ్ నుంచి కూడా తయారు చేయవచ్చు. ఎల్‌పీజీ, డిఎమ్ఈల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. అందుకే దీనిని వంట గ్యాస్‌కు అత్యుత్తమ ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిని నేరుగా వాడటమే కాకుండా, ఎల్‌పీజీలో కలిపి కూడా వినియోగించవచ్చు.
పాత సిలిండర్.. పాత పొయ్యి.. ఖర్చు సున్నా
సాధారణంగా ఏదైనా కొత్త ఇంధనం మార్కెట్లోకి వస్తుందంటే, దానికి తగినట్లుగా కొత్త పొయ్యిలు లేదా సిలిండర్లు కొనాల్సి వస్తుందని సామాన్యులు భయపడుతుంటారు. కానీ డిఎమ్ఈ విషయంలో ఆ టెన్షన్ అక్కర్లేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ ఇంట్లో ఇప్పుడున్న పాత గ్యాస్ స్టవ్, బర్నర్లు, రెగ్యులేటర్, గ్యాస్ పైపులే ఈ కొత్త గ్యాస్‌కు సరిపోతాయి. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండానే ఈ ఇంధనాన్ని వాడుకోవచ్చు. ఇప్పటికే భారతీయ ప్రమాణాల సంస్థ ఎల్‌పీజీలో ఎంత మోతాదులో డిఎమ్ఈ కలపవచ్చనే అంశంపై సాంకేతిక నిబంధనలను కూడా ఖరారు చేసింది.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా మరో అడుగు
భారత్ ప్రస్తుతం తన ఎల్‌పీజీ అవసరాల్లో సగానికి పైగా దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగినప్పుడల్లా మన జేబులకు చిల్లు పడుతోంది. ఈ విదేశీ ఆధారిత పరిస్థితిని మార్చడానికి CSIR-నేషనల్ కెమికల్ లాబొరేటరీ (NCL) శాస్త్రవేత్తలు నడుం బిగించారు. వారు ఇప్పటికే డిఎమ్ఈ ఉత్పత్తి కోసం ఒక పైలట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, మనం విదేశీ గ్యాస్ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. మన బొగ్గు నిల్వలతోనే మన వంటగ్యాస్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. ఇది దేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా, సామాన్యుడికి తక్కువ ధరకే గ్యాస్ అందేలా చేస్తుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
