Ajit Pawar: విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు. ఉదయం 8 గంటలకు ముంబై నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం, గంట తర్వాత బారామతి ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది. విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వర్గాలు ధ్రువీకరించాయి.
ప్రమాద స్థలంలో విమానం శకలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మంటలు, దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ హఠాత్పరిణామంతో మహారాష్ట్ర రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి.
అజిత్ పవార్ 1959 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి అనంత్‌రావ్ పవార్.. సీనియర్ రాజకీయ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్‌కు సోదరుడు. బాబాయి శరద్ పవార్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజిత్‌ప వార్.. 1982లో తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 16 ఏళ్ల పాటు పుణె జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్‌గా వ్యవహరించారు.
1991లో తొలిసారి బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం బాబాయి శరద్ పవార్ కోసం ఆ సీటును త్యాగం చేసి.. రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. 1991 ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
