Maharashtra Mla: రైతు బిడ్డల్ని అందమైన అమ్మాయిలు మనువాడరు

మహిళలకు సంబంధించి మహారాష్ట్రకు చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రైతు కుటుంబంలో పుట్టిన అబ్బాయిలను పెళ్లి చేసుకునేందుకు అందమైన అమ్మాయిలు ఇష్టపడరని వ్యాఖ్యానించారు. అమ్మాయిలను వర్గాలుగా విభజిస్తూ.. మూడో వర్గం వాళ్లతోనే రైతు బిడ్డలు సరిపెట్టుకోవాలని పేర్కొన్నారు. రైతు సమస్యలపై వరూడ్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి.
‘అందంగా ఉండే అమ్మాయిలు.. మీలాంటి, నాలాంటి వాళ్లను ఇష్టపడరు. మంచి ఉద్యోగం ఉన్నవారినే పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడతారు. ఓ మోస్తరు అందంగా ఉండే (రెండో కేటగిరి) అమ్మాయిలు.. కిరాణా, పాన్ షాప్ నడిపేవారిని ఎంచుకుంటారు. మూడో రకానికి చెందిన వారే రైతు బిడ్డను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతారు’’ అని ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ పేర్కొన్నారు. అంతేకాకుండా అటువంటి దంపతులకు జన్మించే పిల్లలు కూడా అందవిహీనంగా ఉంటారంటూ వ్యాఖ్యానించారు.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్.. వరూడ్-మోర్షీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు సన్నిహితుడు. ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్ చేసిన వ్యాఖ్యలపై పలు పార్టీ నేతలతోపాటు మహిళా సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మహిళలను అలా వర్గీకరిస్తూ వ్యాఖ్యానించడం ఎవ్వరూ సహించరని, అటువంటి వారికి గుణపాఠం తప్పదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి యశోమతి ఠాకుర్ మండిపడ్డారు. అజిత్ పవార్‌తోపాటు అధికారంలో ఉన్నవారు ఎమ్మెల్యేను నియంత్రణలో పెట్టుకోవాలని హెచ్చరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com