Maharashtra: 'సీఎం అవుతానని ఊహించలేదు'.. శాసనసభ సమావేశాల్లో షిండే..

Maharashtra: సీఎం అవుతానని ఊహించలేదు.. శాసనసభ సమావేశాల్లో షిండే..
Maharashtra: ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో ఆసక్తికరంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో అదే ఊపు నడుస్తోంది.

Maharashtra: ఏక్‌నాథ్‌ షిండే తిరుగుబాటుతో ఆసక్తికరంగా మారిన మహారాష్ట్ర రాజకీయాల్లో అదే ఊపు నడుస్తోంది. పట్టుబట్టి ప్రభుత్వాన్ని గద్దెదింపిన రెబల్‌ నాయకుడు షిండే.. ముఖ్యమంత్రి పదవి దక్కించుకుని దేశవ్యాప్తంగా సంచలనంగా మారారు. ఇక మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు ఆదివారం ప్రారంభం కాగా, తొలిరోజు స్పీకర్‌ పదవికి ఎన్నిక పూర్తయింది. ఈ సందర్భంగా నయాసీఎం ఏక్‌నాథ్‌ శిండే అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించారు. దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అవుతారని తనతో సహా అంతా భావించారన్నారు. కానీ యాదృచ్ఛికంగా ముఖ్యమంత్రి పదవి తనను వరించిందన్నారు.

సీఎం పదవి తనకు దక్కుతుందని ఊహించలేదన్నారు షిండే. భారతీయ జనతా పార్టీకి 115 ఎమ్మెల్యేలుండగా, తనకు 50 మంది మద్దతే ఉందన్నారు. కానీ పెద్ద మనసుతో బీజేపీ సీఎం పదవిని అప్పజెప్పిందన్నారు. బాలాసాహెబ్‌ ఠాక్రే భావజాలానికి అనుకూలంగా బీజేపీ- శివసేన సర్కార్‌ ఏర్పడిందన్నారు షిండే. బాలాసాహెబ్‌ సైనికుడే సీఎం అయ్యారన్నారు. ఇక తనకు మద్దతివ్వాలని ఏ ఎమ్మెల్యేనూ బలవంతం చేయలేదన్నారు షిండే. మంత్రులతో సహా చాలామంది ఎమ్మెల్యేలు ప్రభుత్వం నుంచి వైదొలగడం మామూలు విషయం కాదన్నారు షిండే.

ఉద్ధవ్‌ ఠాక్రేపైనా పరోక్ష విమర్శలు చేశారు షిండే. కొందరు తమ ఎమ్మెల్యేలతో టచ్‌లో ఉన్నట్లు చెప్పుకొచ్చారన్నారు. కానీ, అదంతా తప్పని నిరూపించామన్నారు. స్పీకర్‌ ఎన్నిక కోసం అసెంబ్లీలో 'హెడ్‌ కౌంట్‌' పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించగా.. బీజేపీ ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. మహా వికాస్‌ అఘాడీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వికి 107 ఓట్లు దక్కాయి. కాగా, ఏక్‌నాథ్‌ షిండే ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది.

Tags

Read MoreRead Less
Next Story