Karnam Malleswari : ప్రధాని మోడీతో మల్లీశ్వరి భేటీ.. కీలక పదవి ఖాయమంటూ వార్తలు

ఒలింపిక్స్‌లో మెడల్ సాధించి భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన ప్రముఖ వెయిట్‌లిఫ్టర్, తెలుగు తేజం కరణం మల్లీశ్వరితో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. హర్యానాలోని యమునానగర్‌లో సోమవారం ఈ భేటీ జరిగినట్లు ప్రధానమంత్రి స్వయంగా వెల్లడించారు. ఈ మీటింగ్ కు సంబంధించిన వివరాలను, ఫొటోలను ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఒక క్రీడాకారిణిగా కరణం మల్లీశ్వరి సాధించిన విజయాలు దేశానికి ఎంతో గర్వకారణమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా తెలిపారు. ఆమె అద్భుతమైన ప్రతిభ, పట్టుదలతో అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిపెట్టారని కొనియాడారు. క్రీడల్లో ఆమె ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు.
స్పోర్ట్స్ రంగంలో వ్యక్తిగత విజయాలతో పాటు, భవిష్యత్ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో కరణం మల్లీశ్వరి చేస్తున్న కృషిని కూడా ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. యువ అథ్లెట్లకు మార్గదర్శకత్వం వహిస్తూ, వారిని ప్రోత్సహించడానికి ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఎంతో అభినందనీయమని ఆయన తెలిపారు. క్రీడాకారిణిగా, మార్గదర్శిగా ఆమె సేవలు దేశానికి ఎంతో విలువైనవని మోదీ అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com