Anti-Rape Bill : రేప్ చేస్తే అంతే.. కఠిన బిల్లుకు మమత సర్కారు ఆమోదం

అత్యాచార కేసులలో దోషులకు జీవితఖైదు విధించే యాంటీ-రేప్ బిల్లును బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు-2024 పేరుతో తీసుకొచ్చిన బిల్లును ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి
మోలాయ్ గాటక్ మంగళ వారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఉన్న చట్టాలను సవరించి అత్యాచారం, లైంగిక నేరాలకు సంబంధించిన కొత్త నిబంధనలను ప్రవేశపెట్టి, మహిళలు, పిల్లల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు.
పెరోల్ లేకుండా దోషులకు జీవితకాల కారాగార శిక్ష విధిం చేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లు చారిత్రకమని వ్యాఖ్యానించారు. "ఈ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని విపక్షాలు అడగాలి. ఆ తర్వాత దానిని అమలు చేసే బాధ్యత మాది. ఈ బిల్లు ద్వారా కేంద్ర చట్టంలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. సత్వర విచారణ, బాధితులకు న్యాయం అందించడం ఈ బిల్లు లక్ష్యం. ఒకసారి ఈ బిల్లు పాస్ అయితే ప్రత్యేక అపరాజిత టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తాం" అని తెలిపారు.
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో సీబీఐ నుంచి న్యాయం కోరుతు న్నామని మమత తెలిపారు. దోషులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు ఈ బిల్లు వెళ్లనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com