Manipur Incident: మీకు కొంచెమైనా బాధ కలగడం లేదా..?- మోదీకి మమతా ప్రశ్న

Manipur Incident: మణిపూర్ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, దీదీ మమతా బెనర్జీ స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi), భాజపా ప్రభుత్వంపై తీవ్ర వాఖ్యలు చేశారు. "ప్రజల్ని చంపే వర్తకులు" అని తీవ్ర పదజాలంతో విమర్శలు చేసింది. గతంలో 2007 సంవత్సరంలో సోనియాగాంధీ(Sonia Gandhi)ని 'మృత్యు వ్యాపారి' అని అప్పటి గుజరాత్ సీఎంగా మోదీ విమర్శిస్తూ చేసిన వాఖ్యలను గుర్తుచేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ వైఖరిని విమర్శించారు. భేటీ బచావో, భేటీ పడావో వంటి స్లోగన్స్ మణిపూర్ మహిళల్ని కాల్చేస్తుంటే ఎక్కడ పోయాయని ప్రశ్నించింది.
జులై 21న జరిగిన తృణమూల్ అమరవీరుల దినోత్సవంలో పాల్గొన్న ఆమె ఈ వాఖ్యలు చేశారు. మణిపూర్‌లో తల్లులు, సోదరీమణుల కోసం నిమిషం మౌనం పాటించారు.
"ఈశాన్య రాష్ట్రాల్లో(North East Sisters)ని ప్రజలు మా సహోదరులు, సహోదరిణులు. మా తల్లులు, చెల్లెల్ల పట్ల మీకు ప్రేమ, గౌరవం లేదా.? ఇంకా ఎంతమంది దళితులు, మహిళలు, ప్రజలను కాల్చేస్తారు" అని ప్రశ్నించింది.
ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను అనాగరికమైన చర్యగా అభివర్ణించింది. మీరు భయపడాల్సిన అవసరం లేదని భారతదేశ ప్రజల తరఫున మీకు సంఘీభావం ప్రకటిస్తున్నామంది.
"ప్రధాని మోదీ ఏవైనా సంఘటనలకు బెంగాల్, రాజస్థాన్, చత్తీస్‌ఘర్ ప్రభుత్వాలవే తప్పని నిందలు మోపుతారు. ఇప్పుడు మణిపూర్‌లో ఎందుకు మౌనంగా ఉన్నారు. భేటీ పడావో, భేటీ బచావో నినాదాలు మణిపూర్ మహిళలు కాలిపోతుంటే వర్తించవా" అని మోదీకి ప్రశ్నల వర్షం కురిపించింది.
"ఈ భాజపా ప్రభుత్వాన్ని పారద్రోలానే మేం ఇండియా కూటమిగా ఏర్పడ్డాం. భాజపా ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యం బతకదు. 2024 సాధారణ ఎన్నికల తర్వాత నూతన భారతావని పుట్టుకొస్తుంది. వాళ్లు దేశాన్ని అమ్ముతున్నారు, మేం దేశాన్ని రక్షిస్తాం. వచ్చే ఎన్నికల్లో దేశంలోని మహిళలే మిమ్మల్ని తరిమికొడతారు." అని అన్నారు. బిల్కిస్ బానోస్ వంటి కేసుల్లో రేపిస్టులు, హంతకులు స్వేచ్ఛగా తిరగనిస్తున్నారు. ఎన్‌కౌంటర్లు నిత్యకృత్యమయ్యాయని అన్నారు.
"ఇది వరకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో మాట్లాడాను. ఇతర లీడర్లు కూడా అంగీకరిస్తే మణిపూర్‌కి వెళ్తాము" అని తెలిపింది.
నూతన ఇండియా కూటమి మోదీపై పోరాడుతుంది, ఈ పోరాటంలో తృణమూల్ కాంగ్రెస్ ఒక నిజాయితీగల సైనికుడిలా పనిచేస్తుంది. జై బంగ్లా-జై భారత్ నినాదంతో ముందుకు వెళ్తామంది. దీని కోసం చేతులు కలిపిన 26 పార్టీలకు కృతజ్ణతలు అని వెల్లడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com