Manipur CM : నన్ను క్షమించండి..గతేడాది మనకు దురదృష్టకరం : మణిపూర్ సీఎం

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ రావణకాష్టంలా రగులుతున్న విషయం తెలిసిందే. రెండు జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన దురదృష్టకర పరిణామాలపై ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ తాజాగా స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. 2025లో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘ఈ సంవత్సరం మొత్తం చాలా దురదృష్టకరంగా సాగింది. గతేడాది మే 3 నుంచి నేటి వరకు రాష్ట్రంలోని పరిణామాల విషయంలో ప్రజలకు నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇళ్లను కోల్పోయారు. అందుకు నేను చింతిస్తున్నాను. క్షమాపణలు కోరుతున్నాను. అయితే గత నాలుగు నెలలుగా శాంతి భద్రతల పురోగతిని చూసిన తర్వాత 2025 నాటికి రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నేను భావిస్తున్నాను. రాష్ట్రంలో 12 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 625 మంది నిందితులు అరెస్టయ్యారు. 5,600 ఆయుధాలు, 35 వేల మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటి వరకూ జరిగిన తప్పులను క్షమించి.. మణిపూర్‌లోని 35 తెగలు కలిసి సామరస్యంగా జీవించాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com