Manish Sisodia : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీశ్ సిసోడియాకు ( Manish Sisodia ) బెయిల్ మంజూరైంది. సుప్రీంకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దేశం విడిచి వెళ్లరాదని పాస్‌పోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరి 26 నుంచి ఆయన జైలులో ఉన్నారు. నూతన మద్యం పాలసీలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సిసోడియాను పలుమార్లు విచారించిన సీబీఐ.. 2023, ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన జైలు జీవితాన్నే గడుపుతున్నారు. విచారణ సమయంలో సీఎం పదవిని ఆశజూపి ఆప్‌ను లొంగదీసుకొనేందుకు బీజేపీ కుట్రకు తెర తీసిందని అరెస్టుకు ముందు సిసోడియా ఆరోపించారు. ఆప్‌ను వీడాలని సీబీఐ అధికారులు తనపై ఒత్తిడి చేశారని 2022 అక్టోబర్ 17న సిసోడియా తెలిపారు. బీజేపీలోకి వస్తే, ఢిల్లీ సీఎం పోస్టు ఇస్తామని ఆఫర్ చేశారని, లేకుంటే జైలుకు పంపిస్తామని బెదిరించారని పేర్కొన్నారు. ఏడాదికి పైగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నా, బీజేపీ బెదిరింపులకు వెరవకుండా సిసోడియా కోర్టుల్లో తన పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాట ఫలితమే ఇవాళ సుప్రీం తీర్పు అని ఆప్ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com