Manu Bhaker: ఖేల్‌రత్న నామినీల జాబితాలో మనుభాకర్ పేరు వివాదం

Manu Bhaker: ఖేల్‌రత్న నామినీల జాబితాలో మనుభాకర్ పేరు వివాదం
X
క్రీడావర్గంలో తీవ్ర చర్చ

ఈ ఏడాది పారిస్‌లో రెండు కాంస్యాలు సాధించి ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది మను బాకర్‌. ఆమెకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ధ్యాన్‌చంద్‌ ఖేల్‌రత్న దక్కుతుందా? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పురస్కారానికి ఇంకా తుది ప్రతిపాదనల జాబితా సిద్ధం కాలేదని, అందులో ఆమె పేరు ఉంటుందని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. ‘‘ఇంకా తుది జాబితా సిద్ధం కాలేదు. వచ్చిన ప్రతిపాదనలపై ఒకట్రెండు రోజుల్లో క్రీడా మంత్రి మన్సుఖ్‌ మాండవీయ నిర్ణయం తీసుకుంటారు. ఇందులో కచ్చితంగా ఆమె (మను) పేరుండే అవకాశముంది’’ అని ఆ వర్గాలు తెలిపాయి. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలో 12 మందితో అవార్డు కమిటీ ఏర్పాటు చేశారు. ఈ అవార్డుల కోసం స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని అథ్లెట్లకు మంత్రిత్వ శాఖ కల్పించింది.

అయితే దరఖాస్తు చేసుకోని అథ్లెట్లను కూడా ఈ పురస్కారాలకు ప్రతిపాదించేందుకు కమిటీకి అనుమతినిచ్చారు. ఖేల్‌రత్న పురస్కారం కోసం వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ కాంస్యం దిశగా భారత పురుషుల హాకీ జట్టును నడిపించిన హర్మన్‌ప్రీత్‌ సింగ్, పారాలింపిక్స్‌ హైజంప్‌లో పసిడి గెలిచిన ప్రవీణ్‌ కుమార్‌ పేర్లను ఈ కమిటీ ప్రతిపాదించినట్లు తెలిసింది. ఈ అవార్డు కోసం మను పేరును పరిగణనలోకి తీసుకోలేదని, ఆమె అసలు దరఖాస్తు చేయలేదనే వార్తలు వస్తున్నాయి. కానీ మను దరఖాస్తు చేసిందని మర్చంట్‌ నేవీలో చీఫ్‌ ఇంజినీర్‌ అయిన ఆమె తండ్రి రామ్‌ కిషన్‌ స్పష్టం చేశాడు. ‘‘ఒలింపిక్స్‌లో ఆడినా భారత్‌లో విలువ ఉండదు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచినప్పటికీ ఖేల్‌రత్న పురస్కారానికి మనును పట్టించుకోవడం లేదు.

దేశం కోసం విజయాలు సాధిస్తూ, గుర్తింపు కోసం అడుక్కోవాల్సి రావడంలో అర్థం లేదు. గత రెండు మూడేళ్లుగా పద్మశ్రీ, పద్మభూషణ్, ఖేల్‌రత్న ఇలా పురస్కారాల కోసం ఆమె దరఖాస్తు చేస్తూనే ఉంది. నా దగ్గర ఆధారాలున్నాయి. ఈ సారి కూడా ఆమె కచ్చితంగా దరఖాస్తు చేసిందనే నమ్మకంతో ఉన్నా. కానీ ప్రస్తుతం నేను సముద్రంలో ఉన్నందున ఏం చూపించలేకపోతున్నా. ఒకవేళ ఆమె దరఖాస్తు చేయకపోయినా, తన ఘనతలు చూసి కమిటీ ప్రతిపాదించాల్సింది’’ అని అతను పేర్కొన్నాడు. మరోవైపు 17 మంది పారా అథ్లెట్లు సహా 30 మంది అథ్లెట్లను అర్జున పురస్కారాలకు కమిటీ సూచించింది.

Tags

Next Story