Resignation : మేమూ మూకుమ్మడి రాజీనామా చేస్తాం

Resignation : మేమూ మూకుమ్మడి రాజీనామా చేస్తాం
X

ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలంటూ జూనియర్‌ వైద్యులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు అపూర్వ మద్దతు లభిస్తోంది. ఇప్పటికే ఆర్‌జీ కర్‌ ఆస్పత్రి సహా పలు ప్రభుత్వ ఆస్పత్రులకు చెందిన దాదాపు 200మందికి పైగా సీనియర్‌ వైద్యులు తమ సంఘీభావం ప్రకటించి మూకుమ్మడిగా రాజీనామాలు చేయగా.. తాజాగా మరో 77మంది వైద్యులు అందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కల్యాణి జేఎన్‌ఎం ఆస్పత్రికి చెందిన 77మంది వైద్యులు పశ్చిమ బెంగాల్‌ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్‌కు పంపిన ఈ- మెయిల్‌లో తమ నిర్ణయాన్ని వెల్లడించారు. అక్టోబర్‌ 14 వరకు గడువు ఇస్తున్నామని.. ఈ లోగా డిమాండ్లు పరిష్కరించకపోతే తమ విధులను నిలిపివేస్తామని హెచ్చరించారు. జూనియర్‌ వైద్యుల నిరవధిక నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడంతో పాటు వారి ఆరోగ్యం క్షీణిస్తుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యులు రిజిస్ట్రార్‌కు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు. అలాగే, పనిచేసే చోట తాము ఎదుర్కొంటున్న మానసిక ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితుల్లో పనిచేయలేకపోవడం వెనుక ఉన్న కారణాలను సైతం ప్రస్తావించారు. జూనియర్‌ వైద్యుల డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చొరవ కనబడకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు ఆరోగ్య కార్యదర్శి ఎన్‌.ఎస్‌.నిగంను తక్షణమే తొలగించడం, పనిచేసే చోట భద్రతాచర్యలు తీసుకోవడం వంటి డిమాండ్లను అక్టోబర్‌ 14లోగా పరిష్కరించాలని.. లేదంటే అధికారికంగా తాము మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు వైద్యులు మూకుమ్మడి రాజీనామాలు పంపగా.. అవి చెల్లవని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సర్వీస్‌ నిబంధనలకు అనుగుణంగా వ్యక్తిగతంగా వైద్యులు రాజీనామా చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

Tags

Next Story