Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి

Chhattisgarh Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. 8 మంది మృతి
X

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా గంగలూర్ అటవీ ప్రాంతంలో ఎదురు‌కాల్పులు జరగ్గా 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతూనే ఉంది.

గంగలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పశ్చిమ బస్తర్‌ డివిజన్‌ మావోయిస్టులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో.. డీఆర్‌జీ, సీఆర్పీఎఫ్‌, కోబ్రా యూనిట్‌, ఎస్‌టీఎఫ్‌ బలగాలు యాంటీ నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు.

దీంతో సిబ్బంది ఎదురుకాల్పులు జరిపి మావోయిస్టులను హతమార్చారు. ఉదయం 8.30 గంటలకు మొదలైన ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో ఆటోమేటిక్‌ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story