Uttar Pradesh : మేనల్లుడిపై మాయావతి వేటు

Uttar Pradesh : మేనల్లుడిపై మాయావతి వేటు
X

బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో కీలక బాధ్యతల నుంచి తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను తప్పించారు. ఒకప్పుడు ఆనంద్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన మాయావతి, ఇప్పుడు అతడిని పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న అతడి తండ్రి ఆనంద్ కుమార్తో పాటు, రాజ్యసభ ఎంపీ రామ గౌతమ్ను కొత్త జాతీయస్థాయి సమన్వయకర్తలుగా నియమించారు. పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ బహుజన్ సమాజం అభివృద్ధి చెందడం రాష్ట్ర ప్రగతికే కాకుండా, యావత్ దేశాభివృద్ధికి అవసరమని మాయావతి ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ జన్మదిన వేడుకలకు సంబంధించిన ప్రణాళికలను వివరిస్తూ, ఆయన సిద్ధాంతాలను పార్టీ ఎప్పటికీ నిబద్ధతతో పాటిస్తుందని అన్నారు. పార్టీ విధానాలకు హానికలిగించే విధంగా తన కుటుంబ సభ్యులెవరైనా తన పేరును దుర్వినియోగం చేస్తే, వెంటనే వారిని పార్టీ నుంచి తొలగిస్తానని పేర్కొన్నారు. ఈ నియమావళి మేరకే ఆకాశ్ మామ అశోక్ సిద్ధార్థ్ ను గతంలో పార్టీ నుంచి బహిష్కరించడం జరిగిందన్నారు.

Tags

Next Story