మోదీ మిడ్ నైట్ మీటింగ్..ఎన్నికల బరిలోకి ఎవరెవరు

మళ్లీ అధికారం చేపట్టాలని అధికార పార్టీ బీజేపీ తహతహలాడుతోంది. బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ, ప్రాజెక్టులు, శంకుస్థాపనలు విరివిగా చేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ పార్టీ ప్రముఖులతో అర్థరాత్రి సమావేశం నిర్వహించారు.
లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ప్రధాని మోదీ అర్ధరాత్రి సమావేశమయ్యారు. ఏప్రిల్-మేలో జరిగే లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించకముందే బీజేపీ తొలి జాబితాను విడుదల చేయాలని యోచిస్తోంది.
వచ్చే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ప్రారంభమైన సమావేశం నాలుగు గంటలకు పైగా కొనసాగింది.
ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ వంటి నేతలు హాజరయ్యారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, గోవా సీఎం ప్రమోద్ సావంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల తేదీలను విడుదల చేయడానికి ముందే ఉత్తరప్రదేశ్‌లోని "బలహీనమైన స్థానాల"పై బిజెపి కసరత్తు చేస్తోంది. ఆయా స్థానాల్లో బలమైన, అత్యంత ప్రజాదరణ పొందిన అభ్యర్ధుల కోసం వేట ప్రారంభించింది. త్వరలో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.
గత వారం కూడా బిజెపి అగ్ర నాయకులు ఎన్నికల సవాలును ఎదుర్కొనేందుకు సిద్ధపడుతూ "బలహీనమైన సీట్ల" గురించి చర్చించడానికి సమావేశాన్ని నిర్వహించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com