Mock Drill: దాడుల్ని ఎదుర్కోవడంపై అన్ని రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు ఇప్పటికే క్షీణించాయి. రక్షణ వ్యవస్థల సన్నద్ధతను ఉభయ దేశాలూ ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పలు రాష్ర్టాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. శత్రువుల నుంచి దాడులు ఎదురైన పక్షంలో పౌరులు సమర్థవంతంగా ఆత్మరక్షణ చేసుకునేందుకు పాటించాల్సిన అంశాలపై మే 7న (బుధవారం) సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ నిర్వహణ సందర్భంగా తీసుకోవలసిన చర్యలను కూడా కేంద్రం సూచించింది.
సెక్యూరిటీ మాక్ డ్రిల్స్ ఇలా..
కేంద్రం సూచనల ప్రకారం.. ఆకాశం నుంచి దాడులు జరగడానికి ముందు వార్నింగ్ సైరన్లు మోగించాలి. శత్రు దాడి జరిగిన పక్షంలో తమను తాము రక్షించుకునేందుకు అవసరమైన శిక్షణను పౌరులు, విద్యార్థులు, ఇతర వర్గాలకు ఇవ్వాలి. హఠాత్తుగా విద్యుత్తు సరఫరాను నిలిపివేసే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. కీలక ప్లాంట్లు లేదా స్థావరాలను గోప్యంగా ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలింపుపై రిహార్సల్స్ చేయడం వంటి చర్యలను కేంద్రం సూచించింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లోగల కంటోన్మెంట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 9 నుంచి 9.30 గంటల వరకు అధికారులు విద్యుత్తు దీపాలను ఆర్పివేశారు. సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌లో భాగంగా పంజాబ్ రాష్ట్ర విద్యుత్ సంస్థ(పీఎస్‌పీసీఎల్)ని అరగంట పాటు విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. యుద్ధ సమయాలలో విద్యుత్ దీపాలను ఆర్పి ఆ ప్రాంతాన్ని అంధకారంలో ఉంచే విధంగా చేపట్టే చర్యల సన్నద్ధత కోసం ఈ రిహార్సల్ చేపట్టినట్లు ఓ అధికారి వివరించారు.
54 ఏండ్ల తర్వాత
దేశంలో సెక్యూరిటీ మాక్‌డ్రిల్స్ నిర్వహణ కొత్తదేమీ కాదు. అదే సంవత్సరం 1971లో బంగ్లాదేశ్ విముక్తి కోసమని భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్‌డ్రిల్స్ నిర్వహిస్తున్నది.
మాక్ డ్రిల్ అంటే…
మాక్‌డ్రిల్ అనేది ఒక రక్షణకు సంబంధించిన శిక్షణ ప్రక్రియ. ఇది వ్యవస్థ లేదా సంస్థ పనిచేస్తున్నదా లేదా అని పరీక్షించి, భవిష్యత్తులో ప్రాణనష్టం జరగకుండా ముందస్తుగా ప్రతిస్పందించడానికి అనుసరించే మార్గం. నిజంగా ప్రమాదం జరగకుండానే ప్రమాదానికి ఎలా ప్రతిస్పందించాలో ప్రాక్టీస్ చేయడంగా దీనిని పేర్కొనవచ్చు. ప్రజలలో అప్రమత్తత పెంపొందించడం, సిబ్బందిలో తక్షణ స్పందన, నైపుణ్యాన్ని మెరుగుపర్చడం, సాంకేతిక లోపాలను ముందుగా గుర్తించడం, ఎమర్జెన్సీ ప్రతిస్పందన బృందాల సరైన సమన్వయాన్ని పరీక్షించడం ఈ మాక్ డ్రిల్‌ల లక్ష్యం. ఉదాహరణకు బహుళ అంతస్తుల భవనాలు, దవాఖానల్లో అగ్నిప్రమాదం, భూకంపం, ఉగ్రదాడి, వరదలు, తుఫాన్లు, రసాయన పొల్యూషన్ లాంటివి సంభవిస్తే ప్రతిస్పందించే విధానాన్ని ప్రదర్శిస్తారు. ఈ మాక్‌డ్రిల్‌లో ఆయా వ్యక్తులు, సంస్థలకు ముందుగా తెలిపి కానీ, తెలపకుండా హఠాత్తుగా గానీ నిర్వహిస్తారు.
కొన్ని దశలవారీగా మాక్‌డ్రిల్స్ ఇలా..
పన్నాగం, సిద్ధత (ప్లానింగ్, ప్రిపరేషన్): ఏ సమయంలో డ్రిల్ చేయాలి, ఎవరెవరు పాల్గొనాలి, ఏ పరిస్థితిని అనుసరించాలి అన్న అంశాలను అధికారులు ముందుగా నిర్ణయిస్తారు. అగ్నిమాపక, వైద్య, పోలీస్, శాఖలు ఇందులో పాల్గొంటాయి.
అలారం లేదా హెచ్చరిక ఇచ్చే దశ: భవనం లేదా ప్రమాద ప్రదేశంలో ప్రమాదం జరిగిందని అలారం మోగిస్తారు లేదా హెచ్చరిక ప్రకటన జారీ చేస్తారు. వైమానిక దాడుల ముందు కూడా ఇలాంటి అలారాలు మోగిస్తారు. అప్పుడు పౌరులు వెంటనే సురక్షిత ప్రాంతాల్లో దాక్కోవాలి.
తరలింపు దశ: ప్రమాదంలో చిక్కుకున్న వారిని భవనం నుంచి బయటకు తరలిస్తారు. అప్పుడు తొక్కిసలాట, గందరగోళం జరగకుండా నియమిత విధానంలో బయటకు వెళ్లేలా చేస్తారు. వారు సురక్షిత ప్రాంతానికి వెళ్లాక హాజరు కొడతారు.
అత్యవసర ప్రతిస్పందన: అత్యవసర పరిస్థితి ఏర్పడిన వెంటనే అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్‌లు, బృందాలు ఘటనా స్థలికి చేరుకుంటాయి. లోపల ప్రమాదంలో చిక్కుకున్న లేదా బందీలైన వ్యక్తులను బయటకు తీసుకురాగలుగుతామా అని పరీక్షిస్తారు. ఉగ్రదాడి అయితే ఉగ్రవాదులను కట్టడి చేసే అవకాశాలను, ప్రక్రియను ఆచరిస్తారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ప్రతిస్పందన సమయం నమోదు చేస్తారు. అన్ని శాఖలు, విభాగాలపై సమీక్ష జరిపి ఏ విభాగంలో లోపాలున్నాయి, ఎందులో మెరుగుదల అవసరం వంటి అంశాలను సమీక్షిస్తారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com