PM Modi : లావోస్ పర్యటనకు మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు లావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల10, 11 తేదీల్లో ఆయన లావోస్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈసందర్భంగా మోదీ 21వ ఆసియాన్-ఇండియా సమ్మిట్, 19వ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గోనున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆసియాన్-ఇండియాకు లావోస్ అధ్యక్షత వహిస్తోంది. ఈ సమావేశాల్లో భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశముందని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోదీ ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గోనున్నారని సమాచారం. ‘‘భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్దకాలం అవుతోంది. ఈ పాలసీ ఇండో-పసిఫిక్ అభివృద్ధికి కీలక స్తంభం వంటిది’’ అని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వేళ ప్రధాని నరేంద్రమోదీ ఇరుదేశాలను సందర్శించి.. యుద్ధం ముగింపు విషయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఇటలీ, అమెరికాలోనూ పర్యటించారు. ప్రస్తుతం మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులోభాగంగా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీతో విస్తృతస్థాయిలో సమాలోచనలు జరిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com