Vande Bharat: మరో ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్న మోదీ

Vande Bharat: మరో ఐదు వందే భారత్‌ రైళ్లను ప్రారంభించనున్న మోదీ
ఐదు కొత్త వందేభారత్‌ రైళ్ల లో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌ నుంచి ప్రారంభం కానుండగా కర్ణాటక, బిహార్‌, గోవాల నుంచి మరో మూడు రైళ్లు ప్రారంభం కానున్నాయి.

ప్రధాని మోదీ ఇవాళ మరో ఐదు వందే భారత్‌ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఉదయం 10.30గంటలకు ప్రారంభించనున్నారు. ఐదు కొత్త వందేభారత్‌ రైళ్ల లో రెండు రైళ్లు మధ్యప్రదేశ్‌ నుంచి ప్రారంభం కానుండగా కర్ణాటక, బిహార్‌, గోవాల నుంచి మరో మూడు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 17 రూట్లలో ఈ సెమీ-హైస్పీడ్‌ రైళ్లు సర్వీసులు అందిస్తుండగా తాజాగా మరో ఐదు వందేభారత్‌ రైళ్లను ప్రారంభిస్తున్నారు. వీటితో కలిపి వందే భారత్‌ రైళ్ల సంఖ్య 24కి చేరుకోనుంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. దీంతో కేంద్రం క్రమంగా ఈ రైళ్ల సంఖ్యను పెంచుతోంది.

మధ్యప్రదేశ్‌లో భోపాల్‌ నుంచి దిల్లీకి ఇప్పటికే ఒక వందే భారత్‌ రైలు సేవలందిస్తుండగా ఇవాళ కొత్తగా రాణి కమలాపతి-జబల్పూర్‌; ఖజురహో-భోపాల్‌-ఇండోర్‌ మధ్య రెండు రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఖజురహో-భోపాల్‌-ఇండోర్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మాల్వా , బుందేల్‌ ఖండ్‌ నుంచి సెంట్రల్‌ కలుపుతూ సర్వీసులు కొనసాగించనుంది. ఈ రైలు ద్వారా మహాకాళేశ్వర్‌, మండు, మహేశ్వర్‌, ఖజురహో, పన్నా తదితర పర్యాక ప్రాంతాలకు వెళ్లే భక్తులకు సౌలభ్యం ఉంటుంది. ఇక.... మడ్‌గావ్‌- ముంబయి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గోవా రాష్ట్రానికి సంబంధించిన తొలి సెమీ హైస్పీడ్‌ రైలు. ఇది ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌ నుంచి గోవాలోని మడ్‌గావ్‌ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగిస్తుంది. ధార్వాడ్‌- బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కర్ణాటకలోని ధార్వాడ్‌, హుబ్బళ్లి, దేవనగరి పట్టణాలను బెంగళూరుకు కలుపుతూ సర్వీసులందిస్తుంది. ఇక హతియా-పట్నా వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఝార్ఖండ్‌, బిహార్‌ రాష్ట్రాలను కలుపుతూ రాకపోకలు కొనసాగిస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story