Monsoon: పేరుకే వానాకాలం.. చినుకులే తప్ప వర్షాలు లేవు
అనుకున్నట్లుగానే ఎల్ నినో తన ఎఫెక్ట్ చూపించింది. రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపించింది. రుతుపవన వర్షపాతం 2023లో ఐదేళ్ల కనిష్టానికి చేరుకుంది. 2018 నుంచి పరిశీలిస్తే ఈ ఏడాదే తక్కువ వర్షపాతం నమోదైంది. ఒకానొక సమయంలో హిమాచల్ ప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. తెలంగాణలో కూడా రెండు విడతల్లో వానలు, వరదలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కానీ వీటికి రుతుపవనాలకు అస్సలు సంబంధం లేదు. మరోవైపు ఇతర రాష్ట్రాలన్నీ వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నాయి. అసలు ఇది వానాకాలమేనా అనుకునే పరిస్థితి ఉంది. గడచిన ఐదేళ్లలో వానాకాలంలో రుతుపవనాలతో కురిసిన వర్షం ఈ ఏడాదే అత్యల్పం. ముఖ్యంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పొడి వాతావరణం ఏర్పడింది.
మనకి రుతుపవనాలు చాలా కీలకం. పంటలకు నీరందించడానికి, జలశయాలను నింపడానికి అవసరమైన 70 శాతం వర్షాన్ని రుతుపవనాలే అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కవగా నీటి సరఫరా వ్యవస్థ లేకపోవడంతో వ్యవసాయానికి రుతుపవనాలే చాలా కీలకం. ఇదిలా ఉంటే ఒకవేళ వేసవి వర్షాలు కూడా తగ్గితే దేశంలో ఆహార ద్రవ్యోల్భణం పెరుగుదలకు దారి తీసే ప్రమాదం ఉంది. చక్కెర, పప్పులు, బియ్యం, కూరగాయలు వంటి వాటి ఉత్పత్తి తగ్గితే మరింత ధరలు పెరిగే అవకాశం ఉంది.
సాధారణంగా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర జలాలు వేడెక్కడాన్ని ఎల్ నినోగా చెబుతారు. ఎల్‌నినో అనేది ఒక స్పానిష్ (లాటిన్) పదం. లాటిన్ భాషలో ఎల్‌నినో అంటే క్రీస్తు శిశువు జననం. దీని కారణంగా భారత, ఆగ్నేయ ఆసియా దేశాల్లో రుతుపవన వ్యవస్థ దెబ్బతిని వర్షపాత పరిమాణం తగ్గుతుంది.దీని వల్ల భారత ఉపఖండంతో వర్షాలు తగ్గి, పొడి పరిస్థితులు ఏర్పడుతాయి. గత మూడేండ్లుగా పసిఫిక్‌పై వరుసగా లానినో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ లానినో గత ఏడాది సెప్టెంబర్‌తో పూర్తయిపోయింది. ఇప్పుడు ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో రుతుపవనాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో ఆ నెలలో 9 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. జూలై నెలలో సగటు కన్నా 13 శాతం వర్షాలు అధికంగా కురిశాయి. ఆగస్టులో 36 శాతం లోటు ఏర్పడింది. మళ్లీ సెప్టెంబర్ నెలలో 13 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. రుతుపవనాల కొరత ఉన్నా కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు సాధారణ వర్షపాతమే నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com