Flash Floods: పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 116 మంది మృతి..

Flash Floods: పాకిస్థాన్‌లో ఆకస్మిక వరదలు.. 116 మంది మృతి..
X
253 మంది వ‌ర‌కు గాయపడ్డారన్న ఎన్‌డీఎంఏ

జూన్ 26 నుంచి పాకిస్థాన్ అంతటా కురుస్తున్న‌ కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా సుమారు 116 మంది మృతిచెందారని, 253 మంది వ‌ర‌కు గాయపడ్డారని ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్డీఎంఏ) తెలిపింది.

ఎన్‌డీఎంఏ తాజా నివేదిక ప్రకారం, వర్ష సంబంధిత సంఘటనల కారణంగా గత 24 గంటల్లో మరో ఐదుగురు మరణించారు, 41 మంది గాయపడ్డారు. తూర్పు పంజాబ్ ప్రావిన్స్ లో అత్యధికంగా 44 మంది చ‌నిపోయారు. ఆ తరువాత వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో 37, దక్షిణ సింధ్ ప్రావిన్స్ లో 18, నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్ లో 16 మంది మృతిచెందారు.

కాగా, రాజధాని ఇస్లామాబాద్ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఎన్‌డీఎంఏ వెల్ల‌డించింది. రేప‌టి (గురువారం) వరకు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులలో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఏజెన్సీ వాతావరణ హెచ్చరిక జారీ చేసిందని జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఇక‌, పాకిస్థాన్‌లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ప్రతి యేటా భారీ వర్షాల కార‌ణంగా వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ప్ర‌కృతి విప‌త్తు చ‌ర్య‌ల కార‌ణంగా భారీగానే ప్రాణ‌న‌ష్టం సంభ‌విస్తోంది.

Tags

Next Story