Maharashtra : మహారాష్ట్రలో ఉద్రిక్తతలు – కర్ఫ్యూ విధింపు

మహారాష్ట్ర శంభాజీ నగర్‌లోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని తొలగించాలని డిమాండ్‌ల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం విదితమే. సోమవారం అర్ధరాత్రి నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో వీటిని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తుంది. నాగ్‌పుర్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు. స్థానిక పోలీస్ కమిషనర్ రవీందర్‌కుమార్ సింగల్ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నాగ్‌పుర్ నగర పరిధిలోని కొత్వాలి, గణేశ్‌పేట్, లకడ్‌గంజ్, పచ్పావులి, శాంతినగర్, సక్కర్‌దర, నందన్‌వన్, ఇమామ్వాడ, యశోధర నగర్, కపిల్‌నగర్‌లలో కర్ఫ్యూ విధించారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.
ఎవరైనా కర్ఫ్యూ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక, నాగ్‌పుర్‌లోని హంసపురి ప్రాంతంలో రెండు వర్గాల మధ్య అర్ధరాత్రి ఘర్షణలు జరిగాయి. కొందరు దుండగులు వాహనాలకు నిప్పంటించడంతో పాటు ఆ ప్రాంతంలోని నివాసాలు, షాపులను ధ్వంసం చేశారు. ఈ ఘటనల్లో దాదాపపు 20 మంది గాయపడ్డారు. వారిలో 15 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఘర్షణకు కారకులైన 17 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలిపారు. సోమవారం మధ్యాహ్నం మహల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహం వద్ద బజరంగ్‌దళ్ కార్యకర్తలు నిర్వహించిన ప్రదర్శన అనంతరం సమస్య మొదలైంది. ఈ ప్రదర్శనలో ఓ వర్గానికి చెందిన మత గ్రంథాన్ని కాల్చారన్న వదంతులు వ్యాపించాయి. దీంతో మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం మధ్యాహ్నానికల్లా కొత్వాలి, గణేశ్‌పేట్ ప్రాంతాల్లోనూ హింస చెలరేగింది. చిట్నిస్ పార్క్, శుక్రవారి తలావ్ ప్రాంతాల్లో అత్యధికంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సమస్యాత్మక గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జి చేశారు. మరోవైపు.. ఔరంగజేబు స్మారకం వద్ద భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లేవారు భద్రతా సిబ్బంది వద్ద రిజిస్టర్‌లో సంతకాలు చేయడంతోపాటు తమ గుర్తింపుపత్రాలను చూపించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com