IIT Bombay : బాంబే ఐఐటీకి రూ.130కోట్ల భారీ విరాళం.. ఎవరిచ్చారంటే?
ప్రఖ్యాత టెక్నికల్ విద్యా సంస్థ ఐఐటీ బాంబేకి ప్రముఖ ఫండ్ మేనేజ్మెంట్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్ 130 కోట్ల రూపాయల భూరి విరాళం అందచేసింది. ఈ విద్యా సంవత్సరంలో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ ను మరింత మెరుగుపరిచేందుకు ఆర్ధిక సహకారం అందిస్తున్నట్లు సంస్థ ఈ సందర్భంగా తెలిపింది. విద్యా సంస్థలకు వచ్చిన అతి పెద్ద కార్పొరేట్ విరాళాల్లో ఇది ఒకటి.
అత్యాధునిక విద్యా సంబంధిత మౌలిక వసతులఏర్పాటు, ఫైనాన్షియల్ మార్కెట్లో వినూత్న కార్యక్రమాల ఆవిష్కరణే లక్ష్యంగా ఈ సాయాన్ని అందించినట్లు సంస్థ తెలిపింది. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటడ్ తన 4000 కోట్ల ఈక్విటీల్లో 10 శాతాన్ని దాతృత్వం కోసం ఇస్తామని గతంలో ప్రకటించింది. ఐఐటీ బాంబేలో మోతీలాల్ ఓస్వా నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటుకు ఈ విరాళం తోడ్పడనుంది. అత్యాధునిక లేబోరేటరీలు, రీసెర్చ్ సెంటర్లతో ఈ విద్యా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.
గ్లోబల్ టాలెంట్ ను ఆకర్షించడం, ఆర్థిక పరిశోధనలో ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐఐటీ బాంబే స్థానాన్ని మరింత సుస్థిరం చేయనుంది. మోతీలాల్ ఓస్వాల్ సెంటర్ ఫర్ క్యాపిటల్ మార్కెట్స్ ద్వారా యూజీ, పీజీ ప్రొఫెషనల్ లెర్నర్ల కోసం పలు రకాల అకడమిక్ ప్రోగ్రమ్లను అందించనుంది. పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్ ఫౌండేషన్కు ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ శిరీష్ కెదారే కృతజ్ఞతలు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com