Mumbai : ఎయిర్ హోస్టెస్ హత్య

మహారాష్ట్రలోని ముంబయిలో ట్రైనీ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదంగా మృతిచెందారు. అంధేరీలోని తన ఫ్లాట్ లోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో అక్కడ స్వీపర్ గా పనిచేసే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ కు చెందిన రూపాల్ ఓగ్రే ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో ఈ ఏప్రిల్ లోనే ముంబయికి వచ్చారు. అంధేరీలోని ఓ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్ లో తన సోదరితో కలిసి ఉంటున్నారు.
అయితే కొద్ది రోజుల క్రితమే సోదరి స్వగ్రామానికి వెళ్లడంతో ఆమె ఒక్కరే ఉంటున్నారు. ఆదివారం సాయంత్రం రూపాల్ కుటుంబ సభ్యులు ఎంతగా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ముంబయిలోని ఆమె ఇతర స్నేహితులను ఫ్లాట్ కు వెళ్లి చూడాలని కోరారు. ఆమె స్నేహితులు ఫ్లాట్ కు వచ్చి చూడగా రూపాల్ డోర్ లాక్ చేసి ఉంది. అనుమానాస్పదంగా అనిపించడం తో వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగం లోకి దిగిన పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు.
లోపల రూపాల్ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నట్టు గుర్తించారు. హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. రూపాల్ ఉంటోన్న హౌసింగ్ సొసైటీ స్వీపర్ విక్రమ్ అత్వాల్ (40) ప్రధాన నిందితుడిగా భావించిన పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. -ఈ కేసులో స్వీపర్ విక్రమ్ అత్వాల్ , అతని భార్యను పోలీసులు విచారణ చేస్తున్నారు. 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. హౌసింగ్ సొసైటీలో స్వీపర్‌గా పనిచేస్తున్న విక్రమ్ అత్వాల్‌తో కొద్ది రోజుల క్రితం రూపాల్ గొడవపడినట్టు సమాచారం. ఈ కేసులో ఆధారాల కోసం హౌసింగ్ సొసైటీలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితుడు విక్రమ్ ఎయిర్ హోస్టెస్ రూపాల్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అనుమానించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు, విక్రమ్ అత్వాల్ భార్యను కూడా విచారిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com