Underground Metro : ముంబైలో మరో అద్భుతం.. సుదీర్ఘ భూగర్భ మెట్రోరైల్ ప్రారంభం

దేశ ఆర్థిక రాజధాని నగరం ముంబైలో తొలిభూగర్భ మెట్రో రైలు పరుగులు తీసింది. ముంబై వాసులు ఏళ్ల నిరీక్షణకు బుధవారంతో తెరపడింది. తొలి సర్వీసు పరుగులు తీసింది. దీనికి ఆక్వా లైన్ అని పేరుపెట్టారు. మొదటి దశలో ఇది శాంటాక్రూజ్ ఎలక్ట్రానిక్స్ ఎక్స్ పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ (సీపడ్) నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) వరకు నడుస్తుంది. 39.5కి.మీ. పొడవైన ఈ మార్గాన్ని కొలాబా-బాంద్రా-ఎస్ఐపిజడ్ లైన్ అని కూడా పిలుస్తారు.
మెట్రోరైళ్లు గరిష్టంగా గంటకు 90 కి. మీ. వేగంతో దూసుకెళ్తాయని, 35 కిలోమీటర్ల ప్రయాణం 50 నిముషాల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు రెండు గంటలు పడుతుంది. తొలి అండర్ గ్రౌండ్ మెట్రో రైల్ సేవలతో ముంబై వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరడంతోపాటు, విలువైన సమయం కూడా ఆదా కానుంది.
ఈ మార్గం నిర్మాణ పనులు 2017లో ప్రారంభమయ్యాయి. ఆరే కాలనీ నుంచి పరేడ్ వరకు ఈ మార్గంలో ముంబై మెట్రో 27 స్టేషన్లను కవర్ చేస్తుంది. కఫ్ పరేడ్, విధాన్ భవన్, చర్చ్ గేట్, మహాత్మా చౌక్, సీఎస్టీ మెట్రో, కల్బాదేవి, గిర్గావ్, గ్రాంట్ రోడ్, ముంబై సెంట్రల్ మెట్రో, మహాలక్ష్మి, సైన్స్ మ్యూజియం, డొమెస్టిక్ ఎయిర్ పోర్టు తదితర స్టేషన్ ల మీదుగా పరుగులు తీస్తుంది. ఉదయం 6.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రైలు సేవలు అందుబాటులో ఉంటాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com