Narendra Modi: జో బైడెన్‌తో మోదీ వర్చువల్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..

Narendra Modi: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం త్వరలోనే ముగుస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేరుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించానన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వర్చువల్ భేటీలో పాల్గొన్నారు మోదీ. ఉక్రెయిన్‌లో పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఇరు దేశాల అధ్యక్షులతో ఇప్పటికే తాను చాలాసార్లు మాట్లాడానని, శాంతి స్థాపన కోసం ప్రయత్నించాలని ఇద్దరికీ విజ్ఞప్తి చేసినట్టు బైడెన్‌కు వివరించారు మోదీ.
ఉక్రెయిన్‌కు ఔషధాలు, ఇరత సహాయ సామగ్రి అందజేయడంతో పాటు ఆదేశంలో నెలకొన్న పరిస్థితిపై భారత పార్లమెంట్‌లోనూ చర్చించిన విషయాన్ని బైడెన్ దృష్టికి మోదీ తీసుకెళ్లారు. అమెరికా, భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య దేశాలన్న మోదీ.. ఇరు దేశాలూ సహజ భాగస్వాములేనన్నారు. బుచాలో అమాయక పౌరుల్ని చంపినట్టు వచ్చిన నివేదికలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయని, తక్షణమే భారత్ ఆ దాడుల్ని ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. ఘటనపై న్యాయవిచారణకు సైతం డిమాండ్ చేశామన్నారు మోదీ.
రష్యా భీకర దాడుల్లో ఘోరంగా దెబ్బతిన్న ఉక్రెయిన్ ప్రజలకు భారత్ మానవతా సాయాన్ని తాము స్వాగతిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. భారత్, అమెరికాల బంధం మరింత బలోపేతం కావాలంటే నిరంతరం సంప్రదింపులు, సంభాషణలు కీలకమని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో ప్రపంచ ఆహార, వస్తు సరఫరాపై పడే ప్రభావాన్ని తగ్గించేలా కృషి చేస్తామన్నారు బైడెన్. మోదీ, బైడెన్ భేటీలో ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితులతో పాటు పలుకీలక అంశాలు చర్చకు వచ్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com