Narendra Modi: ప్రధానిపై సభాహక్కుల ఉల్లంఘన నోటీస్‌..

Narendra Modi (tv5news.in)
X

Narendra Modi (tv5news.in)

Narendra Modi: రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ పోరును ఉధృతం చేసింది.

Narendra Modi: రాష్ట్ర విభజనపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ పోరును ఉధృతం చేసింది. పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలను టీఆర్ఎస్ ఎంపీలు బహిష్కరించారు. హౌస్‌కి లీడర్ అయిన ప్రధాని.. పార్లమెంట్‌ను కించపరిచారని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన బిల్లు పట్ల.. ఫిబ్రవరి 8న ప్రధాని చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని.. పార్లమెంట్ ప్రొసీడింగ్స్, ప్రిసైడింగ్ అధికారిని అవమానించేలా, ప్రశ్నించేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని.. టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు.

దీనిపై రాజ్యసభ సెక్రటరీకి సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. 187 నిబంధన కింద టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ నేత కేకే ప్రివిలేజ్‌ మోషన్ ఇచ్చారు. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే వెల్‌లోకి వెళ్లిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు.. ప్రధాని వ్యాఖ్యలపై నిరసన తెలిపారు. ప్రివిలేజ్‌ మోషన్‌పై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సభ నుంచి వాకౌట్‌ చేశారు.

టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనకు కాంగ్రెస్, సీపీఎం, ఆర్జేడీ, తృణమూల్, శివసేన పార్టీల ఎంపీలు మద్దతు తెలిపారు. టీఆర్‌ఎస్‌ వాదనతో గొంతుకలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్‌ ఖర్గే ప్రధాని తీరుపై మండిపడ్డారు. ఈ విషయంలో మోదీ మాటలు సమర్థనీయంగా లేవని.. ఉభయసభల్లో పాస్‌ అయిన బిల్లుపై వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

అధికారంలోకి వచ్చిన 8 ఏళ్ల తర్వాత కూడా ప్రధాని మీడియా సమావేశంలో ప్రశ్నల్ని ఎదుర్కోకుండా.. వన్‌ టు వన్‌ ఇంటర్వ్యూలపై ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటని విమర్శించారు. అటు లోక్‌సభలోనూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు నిరసన తెలిపారు. సమావేశం ప్రారంభం కాగానే వెల్‌లోకి దూసుకెళ్లిన ఎంపీలు.. ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రధాని వ్యాఖ్యలు పార్లమెంట్‌ ప్రొసీడింగ్స్‌కు విరుద్దమని ప్లకార్డ్స్‌ ప్రదర్శించారు. ప్రధాని తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రివిలేజ్ మోషన్‌పై నిర్ణయం తీసుకునేవరకు సభకు హాజరుకామని సమావేశాలను బహిష్కరించారు. టీఆర్ఎస్‌ ఎంపీల ఆందోళనపై బీజేపీ కూడా ఎదురుదాడి చేసింది. తెలంగాణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ ఏం మాట్లాడారని.. బండి సంజయ్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ మోసాన్ని చెప్పేందుకు మోదీ ప్రయత్నిస్తే.. టీఆర్‌ఎస్‌కు ఎందుకు కోపం వచ్చిందని నిలదీశారు. వార్తల్లో ఉండేందుకే TRS ఎంపీలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎంపీ అరవింద్‌ కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలపై విరుచుకుపడ్డారు. ప్రధానిని మోదీపై ప్రివిలేజ్‌ ఇవ్వడం కాదని.. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌పై ప్రివిలేజ్‌ ఇవ్వాలని.. ఎటాక్‌ చేశారు.

మొత్తంగా అటు టీఆర్‌ఎస్‌.. ఇటు బీజేపీ.. దాడి, ప్రతిదాడులతో.. వ్యవహారం రోజురోజుకీ హీటెక్కుతోంది. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఇటు జిల్లాల్లోనూ నిరసన ర్యాలీలు చేస్తున్న టీఆర్‌ఎస్‌.. అటు హస్తినలోనూ నిరసనల జోరు పెంచింది. దీంతో గత కొద్ది నెలలుగా బీజేపీ-టీఆర్‌ఎస్ మధ్య జరుగుతున్న పొలిటికల్‌ వార్‌.. మరింత తీవ్రమైంది.

Tags

Next Story