Bharat : ఇకపై పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ స్థానంలో ‘భారత్'
దేశంలోని అన్ని పాఠ్య పుస్తకాల్లోని ఇండియా పదాన్ని భారత్ గా మార్చాలని NCERT ప్యానల్ సిఫార్సు చేసింది. పుస్తకాల్లో ప్రాచీన చరిత్రకు బదులుగా సంప్రదాయ చరిత్రను చేర్చాలని NCERT ఇటీవల నియమించిన కమిటీ ఛైర్మన్ ఐజాక్ వెల్లడించారు. జాతీయ స్థాయిలో పాఠ్యపుస్తకాలు, ప్రణాళికలను ఖరారు చేసేందుకే... ఈ ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. కమిటీ సభ్యులంతా... ఏకగ్రీవంగా ఆమోదించినట్లు ఐజాక్ వివరించారు. వివిధ పోరాటాల్లో హిందూ పాలకుల విజయాలను కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కమిటీ సిఫార్సు చేసిందని ఆయన చెప్పారు. అన్ని సబ్జెక్ట్ ల పాఠ్య పుస్తకాల్లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ను ప్రవేశపెట్టాలని కూడా సూచించినట్లు ఐజాక్ వెల్లడించారు. అయితే కమిటీ సిఫార్సులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని NCERT ఛైర్మన్ దినేశ్ సక్లానీ స్పష్టం చేశారు.
వేలాది సంవత్సరాలుగా ఈ భూభాగాన్ని భారత్ గా ప్రస్తావించారని సీఐ ఇజాక్ గుర్తుచేశారు. పురాణ, ఇతిహాసాల్లో భారత్ అనే పదం కనిపిస్తుందన్నారు. 7 వేల సంవత్సరాల నాటి విష్ణు పురాణం లోనూ భారత్ పదం కనిపిస్తుందన్నారు. భారత్ తో పోలిస్తే, ఇండియా అనే పదం ఇటీవల పాపులర్ అయిందన్నారు. ముఖ్యంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభమైన తరువాత, ప్లాసీ యుద్ధం తరువాత ఇండియా అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభమైందన్నారు. అందువల్ల, అన్ని తరగతులకు చెందిన పాఠ్య పుస్తకాల్లో ఇకపై ‘ఇండియా’ అనే పదం స్థానంలో ‘భారత్’ అనే పదాన్ని ఉపయోగించాలని తమ కమిటీ సిఫారసు చేసిందని ఇజాక్ వివరించారు.
మరోవైపు.. ఇండియా పదాన్ని తొలగించడమే కాకుండా.. గతంలో జరిగిన వివిధ పోరాటాల్లో హిందూ విజయాలను కూడా ఎన్సీఈఆర్టీ కొత్త పాఠ్యపుస్తకాల్లో హైలైట్ చేయాలని కమిటీ సిఫార్సు చేసినట్లు ఐజాక్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న చరిత్రలో ఇప్పటివరకు హిందువుల ఓటముల ప్రస్తావనే ఉందని, కానీ మొఘలుల మీద, సుల్తానుల మీద హిందూ రాజులు సాధించిన విజయాలను ఎక్కడ కూడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.
కొత్త పుస్తకాల్లో ఓల్డ్ హిస్టరీకి బదులు.. క్లాసికల్ చరిత్ర ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారుసు చేసిందని తెలిపారు. భారత దేశ శాస్త్రీయ పురోగతి, జ్ఞానం గురించి తెలియకుండా భారత్ ను అంధకారంలో చూపించిన బ్రిటిష్ చరిత్రను ఇకపై ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రగా విభజించనున్నట్టు ఐజాక్ వివరించారు. అన్ని పాఠ్యాంశాల్లో భారతీయ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్) ను ప్రవేశపెట్టాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com