UNESCO: "హోయసల"కు యునెస్కో గుర్తింపు..
కర్ణాటకలోని హోయసల ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలోకి చేరింది. ఈ విషయాన్ని స్వయంగా ది యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ - యునెస్కో తాజాగా సోమవారం వెల్లడించింది. దీంతో భారత్ నుంచి ఈ జాబితాలో వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల సంఖ్య 42కి చేరింది. అంతకుముందు రోజు పశ్చిమబెంగాల్ రవీంద్రనాథ్ ఠాగూర్ ‘శాంతినికేతన్’ని వారసత్వ సంపదగా గుర్తించింది యునెస్కో. ఈ విషయాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) తెలిపింది.
సౌదీ అరేబియాలో జరుగుతున్న 45వ ‘వరల్డ్ హెరితటేజ్ కమిటీ’లో ఈ నిర్ణయం తీసుకున్నారు. హొయసల ఆలయాలు 2014 ఏప్రిల్ 15 నుంచే యునెస్కో పరిశీలన జాబితాలో ఉన్నాయి. 13వ శతాబ్ధపు వాస్తుశిల్ప కళను కలిగిన హొయసల బేలూరులోని చెన్నకేశ ఆలయం, హళీబేడు లోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయం యునెస్కో వారసత్వ ప్రాంతాలుగా గుర్తింపు తెచ్చుకున్నాయి. ఈ ఆలయాల నిర్మాణంలో నగర, భూమిజ, ద్రవిడ శైలులు కనిపిస్తాయి. ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ దేశాల తరువాత అత్యధిక యునెస్కో వారసత్వ ప్రాంతాలు కలిగిన ఆరో పెద్ద దేశంగా ఇండియా నిలిచింది.
హోయసలను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తిస్తూ యునెస్కో తీసుకున్న నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కర్ణాటకలోని హోయసలకు చోటు లభించడం అనేది భారతదేశానికి ఎంతో గర్వకారణమని ట్వీట్ చేశారు. ఆ ఆలయాలపై చెక్కిన సమాచారం, అద్భుతమైన శిల్పకళ భారత సాంస్కృతిక వారసత్వం, పూర్వీకుల కళానైపుణ్యానికి నిదర్శనమని ఆ ట్వీట్‌లో వెల్లడించారు.
అలాగే ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని చారిత్రక ప్రదేశం, ప్రఖ్యాత బెంగాలీ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ వందేళ్లకు ముందు నిర్మించిన విశ్వ భారతి యూనివర్సిటీ ఉన్న శాంతినికేతన్‌ను యునెస్కో గుర్తించింది. శాంతినికేతన్‌కు యునెస్కో గుర్తింపు దక్కడంపై ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతోషం వ్యక్తం చేశారు. రాజధాని కోల్‌కతాకు సుమారు 160 కిలోమీటర్ల దూరంలోని బోల్పుర్ పట్టణం సమీపంలో ఉన్న శాంతినికేతన్.. రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ 1863లో నిర్మించిన ఆశ్రమం. కులమతాలకు అతీతంగా ఎవరైనా ఇక్కడకు వచ్చి పరమాత్మ ధ్యానంలో గడిపేలా దీన్ని నిర్మించారు. 1921లో రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడే విశ్వ భారతి విద్యాలయాన్ని ప్రారంభించారు. 1951లో కేంద్ర విశ్వవిద్యాలయ హోదా దక్కగా.. పశ్చిమ బెంగాల్‌లో ఈ హోదా పొందిన ఏకైక వర్సిటీగా నిలిచింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com