New Aadhaar App : ఆధార్ యాప్‌లో కొత్త వెర్షన్.. mAadhaarకు దీనికి ఉన్న ముఖ్యమైన తేడాలు ఏమిటి?

New Aadhaar App : ఆధార్ యాప్‌లో కొత్త వెర్షన్.. mAadhaarకు దీనికి ఉన్న ముఖ్యమైన తేడాలు ఏమిటి?
X

New Aadhaar App : భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఇటీవల (నవంబర్ 10, 2025న) ఒక సరికొత్త ఆధార్ యాప్‎ను విడుదల చేసింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది. ఇది గుర్తింపు ధృవీకరణతో పాటు అనేక పనులకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే mAadhaar అనే పాత యాప్ ఉండగా, కొత్త యాప్ ఎందుకని చాలా మందికి సందేహం రావచ్చు. ఈ రెండు యాప్‌ల మధ్య తేడాలు, కొత్త యాప్ ఫీచర్ల వివరాలు కింద ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ రెండు యాప్‌లు వేర్వేరుగా పనిచేస్తున్నాయి.

కొత్తగా వచ్చిన ఆధార్ యాప్ ముఖ్యంగా యూజర్‌కు మరింత కంట్రోల్, సేఫ్టీ ఇచ్చేలా రూపొందించారు. ఒకే మొబైల్ నంబర్‌కు లింక్ అయిన మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులను ఒకే యాప్‌లో ఉంచి, సులభంగా నిర్వహించుకోవచ్చు. మీ ఆధార్ డేటాను లాక్ చేయడానికి, అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ అథెంటికేషన్ కంట్రోల్ పూర్తిగా మీ చేతిలో ఉంటుంది. అంటే మీరు అథెంటికేషన్ కోసం అన్‌లాక్ చేసిన తర్వాత, తిరిగి దాన్ని లాక్ చేయవచ్చు.

మీ ఆధార్ వివరాల్లో దేన్ని చూపించాలి, దేన్ని చూపించకూడదో మీరే నిర్ణయించవచ్చు. ఉదాహరణకు మీ పేరు, ఫోటో మాత్రమే కనిపించి, చిరునామా, పుట్టిన తేదీ వంటి వివరాలు కనిపించకుండా నియంత్రించుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, సర్వీస్ సెంటర్ల వద్ద ఆధార్ వెరిఫికేషన్ కోసం QR కోడ్ స్కానింగ్ సదుపాయం యాప్‌లో ఉంటుంది. ఇంటర్నెట్ లేకపోయినా, మీ ఆధార్ వివరాలను యాప్‌లో చూసుకునే సౌలభ్యం ఉంది. మీ ఆధార్‌ను ఏ ఏ సందర్భాల్లో, ఏ ఏ పనుల కోసం ఉపయోగించారో (అథెంటికేషన్ హిస్టరీ) ట్రాక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

కొత్త ఆధార్ యాప్ సెటప్ చేసుకునే విధానం

* కొత్త యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఉపయోగించడానికి ఈ సులువైన స్టెప్స్ పాటించండి

* మీ ఫోన్‌లో ఆధార్ యాప్ డౌన్‌లోడ్ చేసి, ఇన్‌స్టాల్ చేసి, ఓపెన్ చేయండి.

* మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.

* ఆధార్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా వెరిఫై చేయండి.

* తర్వాత, ఫేస్ అథెంటికేషన్ (ముఖాన్ని ధృవీకరించడం) పూర్తి చేయాలి.

* చివరిగా, మీ ఆధార్ ప్రొఫైల్‌ను రక్షించుకోవడానికి 5 అంకెల సెక్యూరిటీ పిన్ జనరేట్ చేసుకోవాలి.

పాత ఎం-ఆధార్' యాప్ ఉపయోగం ఏంటి?

* పాత ఎం-ఆధార్ యాప్ కూడా కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో ఇప్పటికీ అందుబాటులో ఉంది:

* ఆధార్ పత్రాన్ని పీడీఎఫ్ ఫైల్‌గా డౌన్‌లోడ్ చేసుకుని, అవసరమైన చోట సమర్పించవచ్చు.

* ప్లాస్టిక్ పీవీసీ ఆధార్ కార్డును పోస్ట్ ద్వారా ఇంటికి తెప్పించుకోవడానికి ఆర్డర్ చేయవచ్చు.

* ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ల కోసం మీ అసలు ఆధార్ నంబర్‌ను దాచిపెట్టి 16 అంకెల తాత్కాలిక ఐడీని క్రియట్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంది.

* మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్‌ను సరిచూసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు.

Tags

Next Story