New LPG Rules : వంట గ్యాస్ బుకింగ్‌పై కొత్త రూల్స్.. ఇకపై 25 రోజుల గ్యాప్ ఉంటేనే సిలిండర్.

New LPG Rules : మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ సెగలు ఇప్పుడు మన వంటింటి దాకా వచ్చాయి. ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. ఈ క్రమంలో భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. గ్యాస్ సిలిండర్ల బుకింగ్ నియమాలను కఠినతరం చేయడంతో పాటు, బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖ నడుం బిగించింది.
25 రోజుల గ్యాప్ తప్పనిసరి
గ్యాస్ సిలిండర్ల నిల్వను సరిగ్గా నిర్వహించడానికి, అక్రమ నిల్వలను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఇంటర్ బుకింగ్ పీరియడ్‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఒక సిలిండర్ బుక్ చేసిన తర్వాత మళ్లీ 25 రోజుల గ్యాప్ ఉంటేనే రెండో సిలిండర్ బుకింగ్ కు అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ముందే బుక్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ బుకింగ్ ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అయిపోతుంది. కేవలం ఇంటి అవసరాల కోసం (14.2 కిలోల సిలిండర్లు) వాడే గ్యాస్ నిల్వలను భద్రపరచాలని ఇండియన్ ఆయిల్, హెచ్‌పీ, భారత్ పెట్రోలియం సంస్థలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
సరఫరాలో 30 శాతం కోత
భారతదేశం తన గ్యాస్ అవసరాల కోసం ఎక్కువగా కతార్, సౌదీ అరేబియా వంటి దేశాలపై ఆధారపడుతుంది. ప్రస్తుత యుద్ధ ఉద్రిక్తతల వల్ల వారీవారీగా వచ్చే దిగుమతుల్లో ఏకంగా 30 శాతం కోత పడింది. ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం గ్యాస్ రేషనింగ్‌ను చేపట్టింది. విదేశాల నుంచి వచ్చే గ్యాస్‌ను ప్రస్తుతం ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర విభాగాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ సరఫరా చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ఇతర పరిశ్రమలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను సమీక్షించడానికి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
సామాన్యుడికి తప్పని భారం
మార్చి 7వ తేదీ నుంచి గ్యాస్ ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధర సుమారు రూ.115 పెరగగా, ఇంటి అవసరాల కోసం వాడే డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.60 వరకు ఎగబాకింది. అయితే చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం ప్రస్తుతం పెంచబోమని ప్రభుత్వం భరోసా ఇవ్వడం కొంత ఊరట కలిగించే అంశం. గ్యాస్ కొరతను తగ్గించేందుకు దేశీయ రిఫైనరీల్లో ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కూడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
