Noida : నోయిడాలో కొత్త స్కీమ్.. తాగిన వారిని సేఫ్ గా ఇంటికి చేరుస్తామన్న పోలీసులు

కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశంలోని ప్రధాన నగరాలు ఇప్పటికే రెడీ అయ్యాయి. ఆయా నగరాలలోని బార్లు, రెస్టారెంట్లు, పబ్‌లు కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ ఆఫర్లతో సిద్ధంగా ఉన్నాయి. ఇక వేడుకల సందర్భంగా అవాంఛిత ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు సెలబ్రేషన్స్ పై నిబంధనలు విధించారు. నోయిడా పోలీసులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. వేడుకల్లో పూటుగా తాగి పడిపోయేవాళ్లను వారి ఇళ్లకు సురక్షితంగా చేర్చేందుకు క్యాబ్, ఆటో సర్వీసులను ఏర్పాటు చేశారు. మందుబాబులను ఇంటికి పంపడానికి క్యాబ్ సేవలను ఏర్పాటు చేసినట్లు నోయిడా పోలీసు అధికారులు ప్రకటించారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల సహకారంతో నోయిడా పోలీసులు క్యాబ్, ఆటో సేవలను అందిస్తారని తమ ప్రకటనలో పేర్కొన్నారు. అధిక మత్తులో ఉన్న వ్యక్తులను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చడానికి ఇది వీలు కల్పిస్తుందని తెలిపారు. ప్రత్యేక ఏర్పాట్ల గురించి నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ వివరించారు. న్యూ ఇయర్ వేడుకలను సురక్షితంగా, సంతోషంగా జరుపుకునేలా డ్రోన్ నిఘా, ప్రత్యేక క్యాబ్, ఆటో సేవలతో సహా విస్తృతమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నామని.. అధికంగా మద్యం సేవించిన వారు ఇంటికి చేరుకోవడంలో సహాయం చేస్తారని నోయిడా డీసీపీ రామ్ బదన్ సింగ్ చెప్పారు. బార్ అండ్ రెస్టారెంట్ ఆపరేటర్ల మద్దతుతో ఈ సేవలను అందిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com