Nitish Kumar: నితీశ్ మరో యూ టర్న్ కు ?

బీహార్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఆసక్తిని రేపుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న సీఎం నితీశ్‌కుమార్ నేతృత్వంలోని జేడీయూ, లాలూ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ పార్టీల మధ్య విభేదాలు పొడసూపిన నేపథ్యంలో తదుపరి చోటుచేసుకోబోయే పరిణామాల పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాట్నాలో శనివారం నుంచి ప్రారంభం కానున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే బీహార్ పరిణామాలను గమనిస్తున్నామని, ఈ సారి నితీశ్‌కుమార్ తిరిగి బీజేపీ కూటమిలో చేరడం అంత సులభం కాదని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.
బిహార్‌లో జేడీ(యూ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి నితీశ్ వైదొలగడం ఖాయమని, ఆయన తిరిగి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. నితీశ్ ఆదివారం రోజున 9వసారి తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని, డిప్యూటీ సీఎంగా బీజేపీ నాయకుడు సుశీల్ మోదీ ప్రమాణం చేసే అవకాశాలున్నాయని వెల్లడించాయి. మరోవైపు లాలూ యాదవ్ బల సమీకరణ యత్నాల్లో భాగంగా నాలుగు సీట్లున్న జీతన్‌రాం మాంఝీ పార్టీకి డిప్యూటీ సీఎం పదవిని ఆఫర్ చేశారు. జీతన్‌రాం ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో ఉన్నారు. ఈ పరిణామాలపై సుశీల్ మోదీ స్పందిస్తూ.. ‘మూసుకున్న తలుపులు తెరుచుకోవచ్చు’, ‘రాజకీయాల్లో ఏమైనా జరుగొచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా నితీశ్ తన వైఖరిని స్పష్టం చేయాలని లాలూ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు, నితీశ్ గనుక రాజీనామా చేసి స్నేహ హస్తం అందిస్తే.. వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలను ప్రతిపాదించడంలో ఆలస్యం చేయకూడదని బీజేపీ అధిష్టానం బీహార్ నేతలను ఆదేశించింది.
నితీశ్ కుమార్ బీజేపీతో జత కడతారనే ప్రచారం నేపథ్యంలో సమాజ్‍వాది పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్ కుమార్ I.N.D.I.A. కూటమిలోనే కొనసాగితే ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. అఖిలేశ్ యాదవ్ శుక్రవారం టీవీ చానెల్‌తో మాట్లాడుతూ... మా కూటమిలో ప్రధానిమంత్రిగా ఎవరినైనా పరిగణించే అవకాశాలు ఉంటాయన్నారు. కాబట్టి నితీశ్ కుమార్ కూడా రేసులో ఉంటారన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com