NORTH RAINS: వర్షాలు తగ్గినా..ఆగని వరదలు..

ఉత్తరాది రాష్ట్రాలలో వర్షాలు తగ్గినా వరద ముప్పు భయపెడుతోంది. జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో నదులు ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపోవడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు, వరదలకు సంబంధించిన వివిధ ఘటనల్లో వంద మందికిపైగా మృతి చెందారు. ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే 80 మంది వరకు మృతి చెందారు. పంజాబ్‌లో 15 మంది, ఉత్తరాఖండ్‌లో కొండచరియలు విరిగిపడి 9 మంది చనిపోయారు. హిమాచల్‌లో 4 వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాచల్ పర్వత ప్రాంతాల్లో వందలాది మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. కులు జిల్లాలోని కసోల్ ప్రాంతంలో చిక్కుకుపోయిన 2 వేల మంది పర్యాటకులను సురక్షితంగా తరలించినట్లు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు తెలిపారు.
హర్యానాలో అతి భారీ వర్షాలు జలప్రళయాన్ని సృష్టించాయి. వర్షాలకు అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదల ఉధృతికి పలు చోట్ల రోడ్లు కొట్టుకుపోవడం... కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలు చోటు చేసుకొన్నాయి. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వం హెచ్చరించింది. వరద ప్రభావిత ప్రాంతాలపై హర్యానా ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే నిర్వహించారు. అంబాలాలో హోంమంత్రి అనిల్ విజ్ నివాసంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మంత్రి ఇంటి ముందు మోకాలిలోతు నీరు చేరిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అంబాలాతో పాటు అనేక ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయినా మంత్రి అనిల్ విజ్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. బోటులో నగరమంతా తిరిగి పరిస్థితులను పర్యవేక్షించారు.
ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నైనిటాల్, చంపావత్, ఉదమ్‌సింగ్‌నగర్, పౌరీగఢ్‌వాల్ జిల్లాల యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. మరో నాలుగు జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ వద్ద కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. పంజాబ్‌లో నీటిలో చిక్కుకున్న 10 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాటియాలా, రూప్‌నగర్, మోగా, లూథియానా, మొహాలీ, ఫతేఘర్ సాహిబ్ జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది. మరోవైపు ఘగ్గర్ నదిపై ఉన్న మూనక్ వద్ద ఓ ఆనకట్ట మూడు చోట్ల దెబ్బతింది. దీంతో పలు గ్రామాలు నీటమునిగాయి. మరమ్మతులు నిర్వహించకపోవడతోనే ఈ ఆనకట్ట దెబ్బతిన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఫుల్లాడు, మక్రౌద్, చందు వద్ద ఆనకట్టకు గండ్లుపడ్డాయి. ఘగ్గర్ నదిలో ప్రమాదకర స్థాయి కంటే రెండు అడుగులు ఎత్తులో నీరు ప్రవహిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com