Rahul Gandhi : మన్ కీ బాత్’ కాదు.. ‘కామ్ కీ బాత్’ గురించి మాట్లాడు : రాహుల్ గాంధీ

Rahul Gandhi : మన్ కీ బాత్’ కాదు.. ‘కామ్ కీ బాత్’ గురించి మాట్లాడు : రాహుల్ గాంధీ
X

శ్రీనగర్‌లో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంపై మాత్రమే దృష్టి పెట్టి, వాస్తవ సమస్యలైన నిరుద్యోగం, పెరిగిన ధరలను నియంత్రించడంలో విఫలమయ్యారని రాహుల్ ఆరోపించారు. మోదీ 'మన్ కీ బాత్' మాత్రమే చెబుతారని, కానీ దేశంలోని ప్రజల కష్టాలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి 'కామ్ కీ బాత్' గురించి మాట్లాడరని ఆయన ఎద్దేవా చేశారు. అయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మోదీ, బీజేపీ దేశంలో విభజనను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా మోదీ, బీజేపీ ఎక్కడికి వెళ్లినా విద్వేషం మాత్రమే వ్యాపింపజేశారని, అన్నదమ్ములు ఒకరితో ఒకరు పోట్లాడుకునే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. విద్యావంతులకు సరైన ఉద్యోగాలు దొరకడం లేదని, దీనికి కారణం మోదీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం, అక్కడి ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడమే అని చెప్పారు. అంతకు ముందు సోషల్​ మీడియా వేదికగా స్పందిస్తూ.. కేంద్రం తమకు వ్యతిరేకంగా ఎన్ని ప్రచారాలు చేసినా.. రిజర్వేషన్లను కాపాడుకుంటామన్నారు. 'కుల గణన' పేరు చెప్పడానికే ప్రధాని భయపడుతున్నారని, బహుజనులు వారి హక్కులను పొందడం బహుశా ఇష్టం లేదేమోనని సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించారు. ‘‘బహుజన వ్యతిరేక భాజపా ఎన్ని అబద్ధాలు వ్యాప్తి చేసినా - రిజర్వేషన్లకు నష్టం జరగనివ్వం. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగించి సమగ్ర కులగణన జరిపి ప్రతీ వర్గానికి హక్కులు, వాటా, న్యాయం జరిగేవరకు ఆగబోము’’ అని రాహుల్‌ అన్నారు. కులగణన అనేది దేశంలోని రాజకీయ సమస్య మాత్రమే కాదని, వెనకబడిన వర్గాల వారికి న్యాయం చేయడమే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు.

Tags

Next Story