Vatsalya Scheme : చిన్నారుల భవిష్యత్ కోసం ‘వాత్సల్య’ స్కీమ్

Vatsalya Scheme : చిన్నారుల భవిష్యత్ కోసం ‘వాత్సల్య’ స్కీమ్
X

తమ పిల్లల భవిష్యత్‌ కోసం లాంగ్ టర్మ్ లో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం బడ్జెట్‌లో ప్రకటించిన ఎన్‌పీఎస్‌ వాత్సల్యను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 18న ప్రారంభించనున్నారు. పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌధరి, ఆర్థిక శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ స్కీమ్ ప్రారంభంతో పాటు విధివిధానాలు తెలియజేయనున్నారు.18 ఏళ్లలోపు బాలబాలికల పేరుతో తల్లిదండ్రులు/సంరక్షకులు ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా తీసుకోవచ్చు. పిల్లలు మేజర్లు అయ్యాక ఈ ఖాతా సాధారణ ఎన్‌పీఎస్‌ ఖాతాగా మారుతుందని జులైలో ప్రకటించిన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రజలందరికీ సామాజిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో 2004లో తీసుకొచ్చిన ఎన్‌పీఎస్‌.. పన్ను ప్రయోజనాలతో పాటు, లాంగ్ టర్మ్ పెట్టుబడి పథకంగా ఆదరణ దక్కింది. దీన్ని ఇప్పుడు మరింత విస్తృత పరుస్తూ మైనర్లకూ వాత్సల్యను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్‌పీఎస్‌ వాత్సల్య వల్ల ముందుగానే పెట్టుబడులు ప్రారంభించడానికి వీలు పడుతుంది. దీనివల్ల కాంపౌండ్ ఇంట్రెస్ట్(చక్రవడ్డీ) ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంటుంది. మైనర్లుగా ఉన్నప్పుడే ఎన్‌పీఎస్‌ ఖాతా తెరవడం వల్ల రిటైర్మెంట్‌ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్‌ సమకూరుతుంది. ఎన్‌పీఎస్‌ వాత్సల్య ఖాతా వల్ల చిన్నతనంనుంచే తమ పిల్లలకు నుంచే పొదుపు అలవాటు చేయొచ్చు. సాధారణంగా ఎన్‌పీఎస్‌లో టైర్‌-1, టైర్‌-2 ఖాతాలుంటాయి. టైర్‌-1 ప్రైమరీ పెన్షన్ అకౌంట్. ఇందులో చేరినప్పుడు ఉపసంహరణలపై కొన్ని పరిమితులు ఉంటాయి. టైర్‌-2లో స్వచ్ఛంద పొదుపు పథకంలాంటిది. ఎన్‌పీఎస్‌లో పెట్టుబడిపై సెక్షన్‌ 80సీసీడీ(1బీ) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000కు అదనం. పదవీ విరమణ తర్వాత (60 ఏళ్లు) ఎన్‌పీఎస్‌ నిధిలో 60 శాతాన్ని ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు. మిగతా 40 శాతంతో తప్పనిసరిగా యాన్యుటీ పథకాలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా పదవీ విరమణ తర్వాత పెన్షన్ పొందేందుకు వీలుంటుంది.

Tags

Next Story