Polio Virus: భారత్‌లో మరోసారి పోలియో వైరస్ కలకలం.. ఎనిమిదేళ్ల తర్వాత..

Polio Virus: భారత్‌లో మరోసారి పోలియో వైరస్ కలకలం సృష్టించింది. పోలియో రహిత దేశంగా గుర్తింపు పొందిన ఎనిమిదేళ్ల తర్వాత బంగాల్ రాజధాని కోల్కతాలో ఈ వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో అధికారులను అప్రమత్తం చేసింది కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్. కోల్కతాలోని మేతియాబురుజ్ ప్రాంతంలో మురుగు నీటిలో టైప్-1 పోలియో వైరస్ను గుర్తించారు.
దీంతో అధికారులను అప్రమత్తం చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి డ్రైనేజీ నీటిలో పోలియో వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు తెలిపారు. పోలియో వైరస్ మూలాలను కనిపెట్టాలని, తమ ప్రాంతంలో ఎవరైనా పోలియో రోగులు ఉన్నారేమో నిర్ధరించుకోవాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడాలన్నారు.
దేశంలో చివరగా 2011, జనవరి 13న బంగాల్లోని హావ్డా ప్రాంతంలో పోలియో కేసు నమోదైంది. అప్పటి నుంచి దేశంలో పోలియో కేసులు నమోదు కాలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి పోలియో రహిత దేశంగా 2014, మార్చి 27 గుర్తింపు లభించింది. ముందు జాగ్రత్తగా ఐదేళ్ల లోపు పిల్లలకు ఏటా పోలియో టీకాలు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com