No confidence: మోదీ సర్కార్‌పై అవిశ్వాసం

మణిపుర్ అంశంపై ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష ఇండియా ఫ్రంట్ నేతలు( Opposition parties ) కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస( no-confidence motion) అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వాన్ని( BJP-led central government) ఇరుకున పెట్టేందుకు అవిశ్వాస తీర్మానమే సరైందని విపక్ష నేతలు భావిస్తున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమైన నేతలు లోక్‌సభ( Lok Sabha)లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. మణిపుర్( Manipur)పై ప్రధాని మోదీతో ప్రకటన చేయించేందుకు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఇదే సరైన మార్గమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు.
విపక్షాల కూటమి ఇండియాలో పార్టీలు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం( no-confidence motion in Lok Sabha) ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. మణిపుర్ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ లో ప్రకటన చేయాలి అవి డిమాండ్ చేస్తుండగా అధికార భాజపా మాత్రం అందుకు విముఖత చూపుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్ లో పలు పార్టీలు సమావేశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వంపై లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరీ తెలిపారు. మణిపుర్‌పై ప్రధానితో విపులంగా చర్చించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించనందున అవిశ్వాస తీర్మానం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన తెలిపారు.
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలన్న ప్రతిపక్షాల నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒకవేళ విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తమకు భారీ మెజార్టీ వస్తుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గతంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు భాజపాకు 300మంది సభ్యులు మద్దతు తెలిపారని.. ఈసారి 350 కంటే ఎక్కువ మద్దతు దక్కుతుందని ఆయన వెల్లడించారు. 2018 జూలై 20న లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై తొలిసారి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
లోక్‌సభలో ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ విధి విధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ 198 అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఉదయం 10 గంటలలోపు సభ్యుడు తీర్మానంపై లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. కనీసం 50 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానిని స్పీకర్ సభలో చదవి... తీర్మానంపై చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుంచి 10 రోజుల్లోపు చర్చకు తేదీని నిర్ణయించాలి. సభలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేకపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా... ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏకు 330 మందికి పైగా సభ్యుల బలం ఉంది. విపక్ష ఇండియా ఫ్రంట్‌కు 140 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. 60 మందికిపైగా సభ్యులు తటస్థంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com