PAN Aadhaar Link : జరిమానా కట్టే ఓపిక ఉందా? లేకపోతే డిసెంబర్ 31 లోపు ఈ లింక్ పని కానివ్వండి.

PAN Aadhaar Link : మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయలేదా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి గడువును గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా ఈ పని పూర్తి చేయకపోతే, మీ పాన్ కార్డు కేవలం ఒక ప్లాస్టిక్ ముక్కలా మారిపోతుంది. అంటే అది ఇన్-యాక్టివ్ అయిపోతుందన్నమాట. దీనివల్ల మీ బ్యాంకింగ్ లావాదేవీల నుంచి ఆదాయపు పన్ను రిటర్నుల వరకు అన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది. అసలు ఆఖరి తేదీ ఎప్పుడు? లింక్ చేయకపోతే వచ్చే నష్టాలేంటో తెలుసుకుందాం.
ఆఖరి తేదీ ఎప్పుడు? ఎవరికి తప్పనిసరి?
కేంద్ర ఆదాయపు పన్ను శాఖ నిబంధనల ప్రకారం.. 2025 డిసెంబర్ 31వ తేదీ లోపు ప్రతి ఒక్కరూ తమ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయాలి. ముఖ్యంగా అక్టోబర్ 1, 2024 కంటే ముందు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ ద్వారా పాన్ పొందిన వారు ఇప్పుడు ఖచ్చితంగా అసలైన ఆధార్ నంబర్‌తో దానిని అనుసంధానించాలి. ఒకవేళ మీరు ఈ గడువు తప్పితే, 2026 జనవరి 1 నుంచి మీ పాన్ కార్డు పనిచేయదు. జూలై 1, 2017 కంటే ముందు పాన్ కార్డు కలిగి ఉండి, ఇప్పటి వరకు లింక్ చేయని వారు రూ.1,000 జరిమానా చెల్లించి ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది.
పాన్ కార్డు ఇన్-యాక్టివ్ అయితే వచ్చే తిప్పలు ఇవే
ఒకసారి మీ పాన్ కార్డు గనుక ఇన్-యాక్టివ్ అయితే, మీరు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయలేరు. ఒకవేళ మీకు రావాల్సిన టాక్స్ రీఫండ్స్ ఏవైనా ఉంటే అవి కూడా ఆగిపోతాయి. అన్నింటికంటే ముఖ్యంగా మీ బ్యాంక్ లావాదేవీలపై టీడీఎస్, టీసీఎస్ భారీగా అంటే రెట్టింపు స్థాయిలో కట్ అవుతుంది. బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్ ట్రేడింగ్‌లో మీ కేవైసీ ఫెయిల్ అవుతుంది. దీంతో మీ ఇన్వెస్ట్‌మెంట్లు, బ్యాంక్ అకౌంట్లు హోల్డ్‌లో పడిపోయే అవకాశం ఉంది.
లింక్ చేయడం చాలా సులభం
మీరు ఇంటి వద్దే కూర్చుని కేవలం ఐదు నిమిషాల్లో ఈ పని పూర్తి చేయవచ్చు. ముందుగా ఇన్‌కమ్ టాక్స్ ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లండి. అక్కడ Link Aadhaar అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ పాన్, ఆధార్ నంబర్లను ఎంటర్ చేయండి. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వెరిఫై చేస్తే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇప్పటికే జరిమానా కట్టాల్సి ఉంటే, ఈ-పే టాక్స్ ద్వారా రూ.1,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి లింక్ అభ్యర్థన పంపిన తర్వాత సుమారు 30 రోజుల లోపు మీ పాన్ కార్డు మళ్ళీ యాక్టివేట్ అవుతుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

