Pankaj Jain : దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం : పంకజ్ జైన్

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. కొన్ని వారాల క్రితం బ్యారెల్ చమురు ధర 80 డాలర్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం క్రూడాయిల్ ధర 70-72 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే భారతీయులకు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి ఊరట లభించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొనసాగితే.. ప్రభుత్వరంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర మూడేళ్ల కనిష్ఠానికి చేరింది. 2021 డిసెంబర్ తర్వాత బ్యారెల్ చమురు ధర మంగళవారం 70 డాలర్ల దిగువకు చేరింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం కొనసాగుతుండడమే దీనికి కారణం. క్రూడ్ ధరలు తగ్గిన వేళ చమురు ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్ ప్లస్ దేశాలు భావిస్తుండగా.. ఉత్పత్తిని పెంచాలని భారత్ కోరుతోంది. మరోవైపు తక్కువ ధరకు లభిస్తున్న రష్యన్ ఆయిల్‌ను వీలైనంత ఎక్కువగా దిగుమతి చేసుకునేందుకు చమురు కంపెనీలు చూస్తున్నాయని పెట్రోలియం శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.
దేశంలో లోక్ సభ ఎన్నికలకు ముందు ఈ ఏడాది మార్చిలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను లీటరుకు రూ.2 చొప్పున ప్రభుత్వం తగ్గించింది. మరికొన్ని రోజుల్లో జమ్ము-కశ్మీర్, హర్యానా రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర వంటి కీలక రాష్ట్రాల ఎన్నికలు కూడా ఉండడంతో మరోసారి పెట్రో ధరల కోతకు అవకాశం ఉందన్నది మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశంలో 90 శాతం పెట్రోల్ పంపులు ప్రభుత్వ అధీనంలోనే ఉండడంతో ప్రైవేటు రంగ కంపెనీలూ ఆ మేర వాటి ధరలను తగ్గించాల్సి ఉంటుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com