Parliament : నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంట్ ఉభయ సభల్లోని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో సమావేశం అయ్యారు. ఈ భేటీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశం వాడీవేడిగా జరిగింది. అదానీ గ్రూప్‌పై అమెరికా మోపిన లంచం ఆరోపణలు, మణిపుర్‌లోని పరిస్థితులు తదితర విషయాలపై ఈ సమావేశాల్లో చర్చించాల్సిందిగా కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ నేత ప్రమోద్ తివారీ పేర్కొన్నారు. దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలు వంటి విషయాలపైనా చర్చిస్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈ నెల 25 నుంచి మొదలై డిసెంబరు 20 వరకూ కొనసాగనున్నాయి. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని నవంబర్ 26న ఈ సమావేశాలు జరగవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటు సంయుక్త కమిటీ ఈ నెల 29న తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com