Maharashtra : పార్టీ ఓటమి ...కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విపక్ష మహా వికాస్ అఘాడీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘మహా’ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్ష పదవికి నానా పటోలే రాజీనామా చేశారు. ఎన్నికల్లో ఆయన సకోలి స్థానం నుంచి 208 ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది. అటు ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి 51 చోట్ల గెలుపొందింది. కూటమిలో భాగంగా 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాలు మాత్రమే గెలుచుకోవడంతో పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది. 2014లో పార్టీపై వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు.. మోదీ హవాతో మహారాష్ట్రలో కాంగ్రెస్ తీవ్రంగా దెబ్బతింది. అప్పట్లో కేవలం 42 సీట్లు మాత్రమే సాధించింది. నాటినుంచి మళ్లీ కోలుకోలేదు. తాజా ఎన్నికల్లో పాతిక స్థానాలు కూడా సాధించలేకపోయింది. కొన్ని వర్గాలపై అధికంగా ఆధారపడటం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం...తదితర అంశాలతో పార్టీ ప్రజాదరణను కోల్పోతోందని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com