Nirmala Sitharaman: పితృస్వామ్యం వామపక్షాలు కనిపెట్టిన భావన : నిర్మలా సీతారామన్

మన దేశంలో మహిళలు ఎదగకుండా పితృస్వామ్య వ్యవస్థ అడ్డుపడిందే నిజమైతే ఇందిరాగాంధీ ప్రధాని ఎలా కాగలిగారని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు. బెంగళూరులో సీఎంఎస్ బిజినెస్ స్కూల్ విద్యార్థులతో జరిగిన సమావేశంలో మహిళా సాధికారత, పితృస్వామ్యంపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి మహిళా సాధికారత గురించి ప్రశ్నించారు. దీనిపై నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... పితృస్వామ్యం అనేది వామపక్షాలు కనిపెట్టిన భావన అన్నారు. అద్భుతమైన పడికట్టు పదాలకు మోసపోవద్దని... లాజికల్‌గా ఉండాలన్నారు. పితృస్వామ్యం మీ కలలను సాధించకుండా నిలువరించదన్నారు. అదే సమయంలో మహిళలకు తగిన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత, అవశ్యకత ఉందని అంగీకరించారు. మోదీ ప్రభుత్వం ఆవిష్కరణలు చేసే వారికి ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు.
మహిళా సాధికారతపై అడిగిన ప్రశ్నపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. ‘‘భారత్‌లో మహిళల ఎదుగుదలను పితృస్వామ్యం అడ్డుకుంటే.. మరి ఇందిరాగాంధీ ప్రధాని ఎలా అయ్యారు..? ఇలాంటివి విని మోసపోకండి. మీ కోసం మీరు నిలబడి, తర్కయుక్తంగా మాట్లాడితే. ఏ పితృస్వామ్యం మిమ్మల్ని, మీ ఎదుగుదలను అడ్డుకోలేదు’’ అని సీతారామన్ పేర్కొన్నారు. అయితే.. మహిళలకు తగిన సౌకర్యాలు కల్పించడం లేదని, దీని కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
భారత్‌లో ఆవిష్కర్తలకు ఉన్న అవకాశాలపై అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. ‘‘ప్రధాని మోదీ ఆవిష్కర్తలకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించారు. కొత్త ఆవిష్కరణల కోసం కేంద్రం కృషి చేస్తోంది. అది మాత్రమే కాకుండా ఆవిష్కరణలకు తగిన మార్కెట్లను కనుగొనేందుకు కృషి చేస్తోంది’’ అని తెలిపారు. మొత్తం ప్రభుత్వ కొనుగోళ్లలో 40 శాతం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈల నుంచే వస్తున్నాయని వెల్లడించారు. దీనివల్లే 2 లక్షల స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయని.. అందులో 130 యూనికార్న్‌లుగా అవతరించాయని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com