Income : వచ్చే ఐదేళ్లలో తలసరి ఆదాయం రెట్టింపు : మంత్రి నిర్మలా సీతారామన్

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్మాణాత్మక చర్యల వల్ల సామాన్యుల జీవన ప్రమాణాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దిల్లీలో నిర్వహించిన కౌటిల్య ఎకనామిక్ సదస్సుల్లో పాల్గొన్న ఆమె.. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో తలసరి ఆదాయం రెట్టింపవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అసమానతలు తగ్గడంతో పాటు గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయన్నారు. ‘తలసరి ఆదాయం 2,730 డాలర్లకు చేరేందుకు మనకు 75 సంవత్సరాలు పట్టింది. మరో 2,000 డాలర్లును 5 ఏళ్లలో చేరుకోగలం. 2047 నాటికి స్వాతంత్ర్యం సంపాదించి శతాబ్దం పూర్తి కానుంది. ఆ సమయానికి అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ నిలవనుంది’ అని సీతారామన్ అన్నారు. రానున్న దశాబ్దంలో జీవన ప్రమాణాలు బాగా పెరగనున్నాయని అంచనా వేశారు. అందుకు గత పదేళ్లలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే కారణమన్నారు. బ్యాంకుల్లో నిరర్థక ఆస్తుల విలువ కొన్నేళ్ల కనిష్ఠానికి చేరిందన్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద సమర్థవంతమైన రుణ రికవరీ విధానాలు ఉన్నాయని ఈ సందర్భంగా చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com